Jasmine Tea : చక్కని సువాసనను కలిగి ఉండే పూలల్లో మల్లెపూలు కూడా ఒకటి. మల్లెపూల వాసన చూడగానే మానసిక ఆందోళన తగ్గి మనసుకు ఎంతో ప్రశాంతత, ఉత్తేజం కలుగుతాయి. మల్లెపూల చెట్టును మనం ఇంటి ఆవరణలో కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చు. కేవలం చక్కని వాసననే కాకుండా మల్లెపూలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో మల్లెపూలు ఎంతగానో ఉపయోగపడతాయి. మల్లెపూలతో టీ ని చేసుకుని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
చైనా, జపాన్ వంటి దేశాలలో మల్లెపూల టీ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. మల్లెపూలతో టీ ని ఎలా తయారు చేసుకోవాలి.. ఈ టీ ని తాగడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మల్లెపూల టీ ని తయారు చేసుకోవడానికి మనం తాజా మల్లెపూలను శుభ్రంగా కడిగి ఉపయోగించాల్సి ఉంటుంది. మల్లెపూలను, టీ పొడిని 7:1 నిష్పతిలో తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. మరో గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి బాగా వేడి చేయాలి. నీళ్లు వేడైన తరువాత వాటిని మల్లెపూలు, టీ పొడి ఉన్న గిన్నెలో పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత ఈ నీటిని వడకట్టి దానిలో తగినంత పటిక బెల్లాన్ని కానీ, తేనెను కానీ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మల్లెపూల టీ తయారువుతుంది.
ఇలా చేసే టీ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకున్న మల్లెపూల టీ ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా రక్తంలో చెడు కొవ్వు (ఎల్‌డీఎల్) స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఈ టీ ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి ఇప్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు మల్లెపూల టీ ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మల్లెపూల టీ ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల చిగుళ్ల సమస్యలు, దంతాల సమస్యలు రాకుండా ఉంటాయి. మల్లెపూల టీ ని తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నీటిలో మల్లెపూలను వేసి ఒక గంట తరువాత ఆ నీటితో స్నానం చేయడం వల్ల శరీరం నుండి వచ్చే దుర్వాసన తగ్గి శరీరం నుండి చక్కని వాసన వస్తుంది. మల్లెపూల నుండి తీసిన నూనెను రాసి మర్దనా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ నూనెను లేపనంగా రాయడం వల్ల మొటిమల వచ్చే మచ్చలు తొలగిపోతాయి. ఈ విధంగా మల్లెపూలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.