Mint Cucumber Buttermilk : పుదీనా.. కీరదోస.. ఇవి రెండూ మన శరీరానికి మేలు చేసేవే. ఇవి మనకు చల్లదనాన్ని అందిస్తాయి. శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. కనుక పుదీనా, కీరదోసలను ఈ సీజన్‌లో రోజూ తీసుకోవాలి. దీంతో ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది. అయితే ఈ రెండింటినీ మజ్జిగలో కలిపి తీసుకుంటే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి బాగా చలువ చేస్తుంది. ఇక పుదీనా, కీరదోసతో మజ్జిగను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా, కీరదోస మజ్జిగ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – రెండు కప్పులు, కీరదోస – ఒకటి చిన్నది, పుదీనా ఆకుల తరుగు – రెండు పెద్ద టీస్పూన్లు, అల్లం – చిన్న ముక్క, వేయించిన జీలకర్ర పొడి – అర టీస్పూన్, నల్ల ఉప్పు – అర టీస్పూన్, ఉప్పు – తగినంత.
పుదీనా, కీరదోస మజ్జిగ తయారీ విధానం..
ముందుగా పుదీనా, అల్లం, కీరదోస తరుగును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అలాగే పెరుగును చిక్కని మజ్జిగలా చేయాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి గ్లాసుల్లో పోసి ఐస్ ముక్కలు వేస్తే చాలు. ఎంతో రుచికరమైన చల్ల చల్లని పుదీనా, కీరదోస మజ్జిగ రెడీ అవుతుంది. అయితే ఐస్ ముక్కలు వద్దనుకుంటే దీన్ని తయారు చేశాక ఫ్రిజ్‌లో ఉంచి తాగవచ్చు. దీంతో శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేడి మొత్తం తగ్గుతుంది. దీన్ని ఎండలో బయటకు వెళ్లినా.. ఎండ దెబ్బ బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.