Muskmelon Milk Shake : వేసవి కాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లల్లో తర్బూజ కూడా ఒకటి. వేసవి తాపాన్ని తగ్గించడంలో ఈ పండు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో తర్బూజ ఎంతగానో సహాయపడుతుంది. తరుచూ తర్బూజను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీపీని నియంత్రించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తర్బూజ ఎంతో ఉపయోగపడుతుంది.
ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులను తగ్గించడంలో కూడా తర్బూజ సహాయపడుతుంది. చాలా మంది తర్బూజను ముక్కలుగా చేసుకుని తింటుంటారు లేదా జ్యూస్ గా చేసుకుని తాగుతూ ఉంటారు. ఇవే కాకుండా తర్బూజతో మిల్క్ షేక్ ను చేసుకుని కూడా తాగవచ్చు. తర్బూజతో మిల్క్ షేక్ ను చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. తర్బూజతో మిల్క్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తర్బూజ మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తర్బూజ ముక్కలు – ఒక కప్పు, పంచదార – 3 టేబుల్ స్పూన్స్, పాలు – ఒకటిన్నర కప్పు, ఐస్ క్యూబ్స్ – తగినన్ని, యాలకుల పొడి – పావు టీ స్పూన్, తరిగిన బాదం పప్పు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పిస్తా – ఒక టేబుల్ స్పూన్.
తర్బూజ మిల్క్ షేక్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో తర్బూజ ముక్కలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఐస్ క్యూబ్స్, పాలు, యాలకుల పొడిని వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని పైన తరిగిన బాదం పప్పు, పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చల్ల చల్లగా ఎంతో రుచిగా ఉండే తర్బూజ మిల్క్ షేక్ తయారవుతుంది. ఇందులో పంచదారకు బదులుగా తేనెను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా తర్బూజతో మిల్క్ షేక్ ను చేసుకుని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. శరీరం చల్లగా ఉంటుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు.