Gongura Eggs Curry : మనం ఆహారంగా తీసుకునే ఆకు కూరల్లో గోంగూర కూడా ఒకటి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. గోంగూరతో పచ్చడిని, పప్పునే కాకుండా గోంగూర మటన్, గోంగూర చికెన్ వంటి వాటిని కూడా తయారు చేస్తుంటారు. ఇవే కాకుండా గోంగూరను కోడిగుడ్లతో కలిపి కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసిన కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. గోంగూరను కోడిగుడ్లతో కలిపి కూరలా ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర కోడి గుడ్డు కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన గుడ్లు – 6, గోంగూర – ఒక కట్ట, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెబ్బ, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 4, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా దినుసులు..
లవంగాలు – 4, యాలకులు – 3, దాల్చిన చెక్క ముక్కలు – 3, సాజీరా – అర టీ స్పూన్.
గోంగూర కోడి గుడ్డు కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక టీ స్పూన్ నూనెను వేసి కాగిన తరువాత శుభ్రంగా కడిగిన గోంగూరను వేసి కలుపుతూ ఉడికించి చల్లగా అయ్యే వరకు ఉంచి జార్ లో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత ఉడికించిన గుడ్లను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో మసాలా దినుసులను, జీలకర్రను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకును వేసి ఒక నిమిషం పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు నీళ్లను పోసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించాలి. తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ను వేసి కలిపి 3 నిమిషాల పాటు ఉడికించాలి. 3 నిమిషాల తరువాత వేయించి పెట్టుకున్న గుడ్లను వేసి మూత పెట్టి 8 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర కోడిగుడ్డు కర్రీ తయారవుతుంది. ఈ కర్రీని అన్నం, చపాతీ, పుల్కా వంటి కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా గోంగూరను, కోడి గుడ్డును తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.