Miriyala Charu : మనం వంటల్లో ఉపయోగించే వాటిల్లో మిరియాలు ఒకటి. మిరియాల వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మనందరికీ తెలుసు. మిరియాలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం సమస్యను కూడా మిరియాలు తగ్గిస్తాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మిరియాలు సహాయపడతాయి.
శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలోనూ మిరియాలు ఉపయోగపడతాయి. మనం ఎక్కువగా వంటల్లో, సలాడ్స్ లో మిరియాల పొడిని వాడుతూ ఉంటాం. మిరియాలతో చారును కూడా తయారు చేస్తారని మనందరికీ తెలుసు. మిరియాలతో చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. విలేజ్ స్టైల్ లో మిరియాల చారును మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విలేజ్ స్టైల్ మిరియాల చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
మిరియాలు – ఒక టీ స్పూన్, చింతపండు – 15 గ్రా., టమాటాలు – 2, ఎండు మిర్చి – 4, కరివేపాకు – రెండు రెబ్బలు, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి – 1(పెద్దది), ఉప్పు – రుచికి సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, మెంతులు – ఒక టీస్పూన్, నీళ్లు – సరిపడా.
విలేజ్ స్టైల్ మిరియాల చారు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చింత పండును, రుచికి సరిపడా ఉప్పును వేసి నానబెట్టుకోవాలి. తరువాత ఒక గ్లాసు నీళ్లను పోసి చింత పండు నుండి గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో జీలకర్రను, మిరియాలను వేసి కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టిన తరువాత అదే జార్ లో వెల్లుల్లి రెబ్బలను వేసి కచ్చా పచ్చాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా చేసి పెట్టుకున్న చింత పండు గుజ్జులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో టమాటాలను, ఒక రెబ్బ కరివేపాకును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా చింత పండు గుజ్జులో వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, కచ్చా పచ్చాగా చేసుకున్న ఎండు మిర్చి, కరివేపాకు వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగాక ముందుగా అన్నీ వేసి కలిపి పెట్టుకున్న చింత పండు గుజ్జును పోయాలి. తరువాత పులుపుకు తగ్గట్లు నీళ్లను పోసుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి, మూత పెట్టి, మధ్యస్థ మంటపై మిరియాల చారును మరిగించుకోవాలి. ఈ చారును మరీ ఎక్కువగా మరిగించకూడదు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిరియాల చారు తయారవుతుంది. మిరియాలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. మానసిక ఒత్తిడితో బాధపడే వారు మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు.