Chepala Vepudu : మనకు లభించే మాంసాహార ఉత్పత్తులల్లో చేపలు ఒకటి. చేపలలో అనేక రకాలు ఉంటాయి. చేపలను తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ భూమి మీద అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో చేపలు ఒకటి. మెదడు, శరీర అభివృద్ధికి ఉపయోగపడే విటమిన్ డి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలలో అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలలో చేపలు ఒకటి. చేపలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయిని వైద్యులు చెబుతున్నారు.
గర్భిణీలకు, బాలింతలకు చేపలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. మెదడు పని తీరును మెరుగుపరచడంలో, జ్ఞాపక శక్తిని పెంచడంలో చేపలు ఎంతో సహాయపడతాయి. పిల్లలల్లో అస్తమాను తగ్గించడంలో కూడా చేపలు సహాయపడతాయి. కనుక చేపలను ఆహారంలో భాగంగా చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. చేపలతో మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. చేపలతో చేసే వంటలల్లో చేపల వేపుడు ఒకటి. చేపల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. తక్కువ నూనెతో, క్రిస్పీగా, ఎంతో రుచిగా ఉండే చేపల వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపలు – ఒక కిలో( ముక్కలుగా చేసుకోవాలి), పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, మిరియాల పొడి – అర టీ స్పూన్, నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చేపల వేపుడు తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను కొద్దిగా పసుపు, రాళ్ల ఉప్పు వేసి శుభ్రంగా కడిగి.. నీరు లేకుండా ఒక ప్లేట్ లోకి కానీ.. గిన్నెలోకి కానీ తీసుకోవాలి. ఈ చేప ముక్కలపై పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి చేప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చేప ముక్కలను 10 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత అడుగు భాగంలో గుంతగా ఉండే కళాయిని తీసుకుని అందులో నూనెను వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలపై ఎక్కువగా ఉన్న కారం మిశ్రమాన్ని తీసేస్తూ చేప ముక్కలను నూనెలో వేసి మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా చేప ముక్కలపై ఎక్కువగా ఉన్న కారం మిశ్రమాన్ని తీసేస్తూ వేయించుకోవడం వల్ల చేప ముక్కల పైభాగం మాడి పోకుండా ఉంటుంది.
కళాయిలో నూనె తక్కువ అయినప్పుడు మరి కొద్దిగా నూనెను వేసుకుంటూ చేప ముక్కలను వేయించుకోవాలి. చేప ముక్కలను వేయించిన తరువాత మిగిలిన నూనెలో కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కరివేపాకుతోపాటు.. తరిగిన కొత్తిమీరను కూడా.. వేయించి పెట్టుకున్న చేప ముక్కలపై వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల వేపుడు తయారవుతుంది.
ఇలా చేసుకున్న చేపల వేపుడును ఉల్లిపాయ, నిమ్మరసంతో కలిపి నేరుగా తినవచ్చు. లేదా పప్పు, రసం, సాంబార్ వంటి వాటిల్లో కూడా తినవచ్చు. ఇందులో ఉపయోగించిన ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడిని అప్పటికప్పుడు తయారు చేసుకుని వాడడం వల్ల చేపల వేపుడు మరింత రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. చేపలను తరుచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు త్వరగా రావు.