Barley Java : బార్లీ గింజలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. అధిక బరువును తగ్గించడంలో.. మూత్రాశయ సమస్యలను తగ్గించడంలో.. కిడ్నీ స్టోన్స్‌ను కరిగించడంలో.. బార్లీ గింజలు ఎంతగానో మేలు చేస్తాయి. అయితే వీటిని నీటిలో మరిగించి అందులో తేనె, నిమ్మరసం కలిపి తాగుతుంటారు. కానీ బార్లీ గింజలతో జావ తయారు చేసి తాగవచ్చు. ఇది రుచిగా ఉండడమే కాకుండా.. దీంతో మనకు ప్రయోజనాలు కలుగుతాయి. ఇక బార్లీ గింజలతో జావను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బార్లీ గింజల జావ తయారీకి కావల్సిన పదార్థాలు..
బార్లీ గింజలు – పావు కప్పు, మజ్జిగ – కప్పు, దానిమ్మ గింజలు – గుప్పెడు, ఉప్పు – తగినంత.
బార్లీ గింజల జావను తయారు చేసే విధానం..
బార్లీ గింజలను కడిగి నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. ఇలా చేస్తే త్వరగా ఉడుకుతాయి. ఈ గింజలను కుక్కర్‌లో వేసి 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తరువాత వడబోయాలి. అనంతరం అందులో మజ్జిగ, దానిమ్మ గింజలు, ఉప్పు వేసి బాగా కలపాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా తాగవచ్చు. లేదా వెచ్చగా ఉన్నప్పుడు కూడా తాగవచ్చు. ఇందులో పటిక బెల్లం లేదా తేనె, నిమ్మరసం వంటివి కలిపి కూడా తాగవచ్చు. దీంతో బార్లీ గింజల జావ చాలా రుచిగా ఉంటుంది. ఈ జావను తాగడం వల్ల శరీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.