Meal Maker Masala Curry : సోయా గింజల నుండి నూనెను తీసిన తరువాత మిగిలిన పదార్థంతో తయారు చేసినవే మీల్ మేకర్స్(పోయా చంక్స్). మీల్ మేకర్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఇవి సహాయపడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, బరువు తగ్గడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. మహిళల్లో హార్మోన్ అసమతుల్యతల వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంతోపాటు, మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో దోహదపడతాయి.
మీల్ మేకర్స్‌లలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. మాంసం తినని వారు వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. మీల్ మేకర్స్ తో కూడా మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మీల్ మేకర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు.. వాటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్స్( సోయా చంక్స్) – ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన టమాటా – ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు – 5, దాల్చిన చెక్క ముక్కలు – 2 (చిన్నవి), సాజీరా – ఒక టీ స్పూన్, యాలకులు – 3 లేదా 4, జీడి పప్పు – 10, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడా, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – అర లీటర్.
మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అర లీటర్ నీటిని పోసి కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న నీటిలో మీల్ మేకర్ ను వేసి 10 నిమిషాల పాటు ఉంచాలి. 10 నిమిషాల తరువాత మీల్ మేకర్ లలోని నీటిని పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసి కాగాక ముందుగా గిన్నెలోకి తీసుకున్న మీల్ మేకర్ లను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక గిన్నెలోకి లేదా ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక జార్ లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, నువ్వులు, ధనియాలు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత టమాటా ముక్కలను వేసి మూత పెట్టి ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. తరువాత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ముందుగా మెత్తగా చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ లను, ఒక గ్లాసు నీటిని పోసి కలిపి మూత పెట్టి మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ తయారవుతుంది. ఈ కర్రీని పులావ్ లేదా చపాతీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.