Menthi Kura Tomato Curry : మెంతికూర అద్భుత‌మైన ఆకుకూర‌.. దీన్ని ఇలా వండుకుని తిన‌వ‌చ్చు..!

Menthi Kura Tomato Curry : మ‌నం కొన్ని ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసేట‌ప్పుడు కొన్ని మెంతికూర ఆకుల‌ను కూడా వేస్తూ ఉంటాం. మెంతికూర కూర రుచిని పెంచ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మెంతికూర చేదుగా ఉన్న‌ప్ప‌టికీ దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొవ్వును క‌రిగించ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, బరువు త‌గ్గ‌డంలో, ర‌క్త హీనత స‌మ‌స్య‌ను తగ్గించ‌డంలో మెంతికూర ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. కూర‌లలో వేయడ‌మే కాకుండా మెంతికూర‌తో కూర‌ను కూడా చేసుకోవ‌చ్చు. మెంతికూర‌తో చేసే ట‌మాట క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను చాలా సులువుగా చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే మెంతికూర ట‌మాట క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Menthi Kura Tomato Curry wonderful food prepare in this way
Menthi Kura Tomato Curry

మెంతికూర ట‌మాట క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన మెంతికూర – ఒక క‌ప్పు, త‌రిగిన ట‌మాటాలు – 4 (పెద్ద‌వి), స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – ఒక‌టి, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.

మెంతికూర ట‌మాట క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత జీలక‌ర్ర‌, ఆవాలు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చి మిర్చి ముక్క‌లు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌లిపి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. ఇప్పుడు త‌రిగి, శుభ్రంగా క‌డిగిన మెంతికూర‌ను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న త‌రువాత ట‌మాట ముక్క‌ల‌ను వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ప‌సుపు, కారం, ఉప్పు వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ట‌మాటాలు పూర్తిగా ఉడికే వ‌ర‌కు ఉంచాలి. ట‌మాటాలు ఉడికిన త‌రువాత గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి వేసి క‌లిపి మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉంచాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర ట‌మాట క‌ర్రీ త‌యార‌వుతుంది.

దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు జ‌రుగుతుంది. మెంతికూర‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బాలింత‌ల‌లో పాల ఉత్ప‌త్తిని పెంచే శ‌క్తి మెంతికూర‌కు ఉంది. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో కూడా మెంతికూర ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌రుచూ మెంతికూర‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts