Ragi Sangati : రాగి సంగ‌టిని త‌యారు చేయ‌డం సుల‌భ‌మే.. ఎంతో బ‌లవ‌ర్ధ‌క‌మైంది.. రోజూ తినాలి..!

Ragi Sangati : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం రోజూ తీసుకుంటున్న ఆహారాల్లో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌ళ్లీ మ‌నం చిరు ధాన్యాలను, వాటితో చేసే ఆహార ప‌దార్థాలను ఎక్కువ‌గా తీసుకుంటున్నాం. ఈ చిరు ధాన్యాల‌ల్లో రాగులు ఒక‌టి. ఈ రాగుల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. బ‌రువు త‌గ్గ‌డంలో, షుగ‌ర్‌, బీపీ వంటి వ్యాధుల‌ను నియంత్రించ‌డంలో రాగులు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ రాగుల‌తో త‌యారు చేసే ఆహార ప‌దార్థాల‌లో రాగి సంగ‌టి ఒక‌టి. రాగి సంగ‌టిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ రాగి సంగ‌టిని ఎలా త‌యారు చేయాలి, దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Ragi Sangati recipe make in this way it is very healthy food Ragi Sangati recipe make in this way it is very healthy food
Ragi Sangati

రాగి సంగ‌టి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక క‌ప్పు, రాగి పిండి – ఒక క‌ప్పు, నీళ్లు -5 క‌ప్పులు, ఉప్పు – ఒక టీ స్పూన్‌.

రాగి సంగ‌టి త‌యారీ విధానం..

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి అర గంట పాటు నాన‌బెట్టుకోవాలి. రాగి పిండిలో కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ ఉండ‌లు లేకుండా క‌లిపి ప‌క్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని తీసుకున్న క‌ప్పు ప‌రిమాణంతో 5 క‌ప్పుల నీటిని ఒక గిన్నెలో పోసి బాగా వేడి చేయాలి. ఈ నీళ్లు వేడి అయిన త‌రువాత ముందుగా నాన‌బెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. ఈ బియ్యం 60 శాతం ఉడికిన త‌రువాత ఉండ‌లు లేకుండా క‌లిపి పెట్టుకున్న రాగి పిండిని వేసి బాగా క‌లిపి మూత పెట్టి, మ‌ధ్య‌స్థ మంటపై ఉడికించుకోవాలి. ఇలా అన్నం పూర్తిగా ఉడికిన త‌రువాత ఒక గంటెను కానీ, ప‌ప్పు గుత్తిని కానీ తీసుకుని అన్నాన్ని మెత్త‌గా చేయాలి. ఇలా చేసిన త‌రువాత మూత పెట్టి, చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు ఉంచి త‌రువాత‌ స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న రాగి సంగ‌టిని చేతికి నెయ్యిని రాసుకుంటూ ముద్ద‌లుగా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రాగి సంగ‌టి త్వ‌ర‌గా చ‌ల్ల‌గా అవ్వ‌కుండా ఉంటుంది. మాంసాహారం తిన‌ని వాళ్లు దీనిని ప‌ప్పు, సాంబార్‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు. నాటు కోడితో చేసిన పులుసుతో రాగి సంగ‌టిని క‌లిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీనితోపాటుగా రాగులల్లో ఉండే పోష‌కాలు కూడా శ‌రీరానికి ల‌భిస్తాయి. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పైగా రాగి సంగ‌టిని ఇలా త‌యారు చేసి వేస‌విలో తీసుకుంటే శ‌రీరం కూడా చ‌ల్ల‌గా ఉంటుంది. వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎండ దెబ్బ త‌గ‌ల‌కుండా ఉంటుంది.

D

Recent Posts