Chintapandu Pulihora : చింతపండుతో పులిహోర తయారు చేసుకుని తింటే వచ్చే మజాయే వేరు. అందులో మిరియాల పొడి, ఇంగువ వంటి పదార్థాలను వేసి కొందరు భలేగా తయారు చేస్తారు. అయితే చింతపండు పులిహోరను ఎవరైనా సరే టేస్ట్‌గా తయారు చేసుకోవచ్చు. అందుకు గాను సరైన పదార్థాలను వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ పులిహోర సరిగ్గా రావాలంటే.. దీన్ని ఎలా తయారు చేయాలి.. అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – అరకిలో, నూనె – ఒక టీ స్పూన్, పసుపు – ఒక టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, చింతపండు – 50 గ్రా., ఉప్పు – రుచికి సరిపడా, పచ్చి మిర్చి – 4.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, పల్లీలు – అర కప్పు, శనగ పప్పు – 2 టీ స్పూన్స్, మినప పప్పు – 2 టీ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 4, కరివేపాకు – 2 రెబ్బలు, పచ్చి మిర్చి – 4, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ఇంగువ – ఒక టీ స్పూన్.
చింతపండు పులిహోర తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అర గంట పాటు నానబెట్టుకోవాలి. చింతపండును కూడా ఒక గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో బియ్యం, బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు, చిటికెడు ఉప్పు, నూనె, అర టీ స్పూన్ పసుపు వేసి ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తరువాత ఒక పెద్ద పాత్ర తీసుకుని అన్నాన్ని పొడిగా అయ్యేలా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుండి గుజ్జును తీసి పెట్టుకోవాలి. ఒక కళాయిలో చింత పండు గుజ్జు, అర టీ స్పూన్ పసుపు, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు ను వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరో కళాయి తీసుకుని అందులో నూనె వేసి కాగాక.. పల్లీలు, శనగపప్పు, మినప పప్పు వేసి వేగాక మిగిలిన తాళింపు పదార్థాలన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకున్న అన్నంలో ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి అన్నం మొత్తానికి బాగా పట్టేలా కలుపుకున్న తరువాత తాళింపు వేసి మరో సారి కూడా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు పులిహోర తయారవుతుంది. ఇది బయట తిన్నట్లే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేస్తే పులిహోర రెండు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది.