Tomato Carrot Soup : టమాటా.. క్యారెట్.. ఇవి రెండూ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించేవే. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యారెట్‌లో అయితే విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కంటి చూపు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇలా.. ఈ రెండింటితోనూ మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రెండింటినీ కలిపి రోజూ సూప్‌లా తయారు చేసి తీసుకుంటే.. ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. మరి టమాటా, క్యారెట్ సూప్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
టమాటా – క్యారెట్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 4 , క్యారెట్ – 2, ఉప్పు – తగినంత, నెయ్యి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, చక్కెర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, క్రీమ్ – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాటా – క్యారెట్ సూప్ తయారీ విధానం..
టమాటా, క్యారెట్ లను ముక్కలుగా చేసుకోవాలి. వీటిని కొన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టీ వడకట్టుకోవాలి. దీనికి కొన్ని నీళ్లు కలపాలి. ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేసి అది వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా – క్యారెట్ సూప్ పోసి చిన్న మంటపై మరిగించాలి. ఇలా మరుగుతున్న సూప్ లో చక్కెర వేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటా – క్యారెట్ సూప్ తయారవుతుంది. దీన్ని రోజూ ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. దీని వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.