Radish Curry : మనం వంటింట్లో అతి తక్కువగా ఉపయోగించే కూరగాయల్లో ముల్లంగి ఒకటి. వాసన, రుచి కారణంగా వీటిని తినడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ముల్లంగిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణాశయం, ప్రేగులకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో ముల్లంగి ఎంతో సహాయపడుతుంది. కాలేయం, పిత్తాశయానికి సంబంధించిన సమస్యలను కూడా ముల్లంగి తగ్గిస్తుంది. ఆకలిని పెంచడంలో ముల్లంగి ఎంతో దోహదపడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను కూడా ముల్లంగి నియంత్రిస్తుంది.
ముల్లంగిలో ఉండే రసాయనాలకు క్యాన్సర్ కణాలను నశింప చేసే శక్తి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ఉపయోగాలు ఉన్న ముల్లంగిని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ముల్లంగితో మనం రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా ముల్లంగితో కూర ఎలా తయారు చేసుకోవాలి, దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముల్లంగి కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ముల్లంగి ముక్కలు – పావు కేజీ, టమాట – 1 (తరగాలి), ఎండు కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్స్, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ – 1 (తరగాలి), తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ముల్లంగి కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగాక టమాట ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు ఒకదాని తరువాత ఒకటి వేసి కలపాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత ముల్లంగి ముక్కలు, ఎండు కొబ్బరి పొడి వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల కూర చిక్కగా అవుతుంది. ముల్లంగి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి ఉప్పును సరి చూసుకుని పైన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ముల్లంగి కూర తయారవుతుంది. ఇలా ముల్లంగితో కూర చేసుకుని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.