Ulavacharu : ఉల‌వల చారు.. ఆరోగ్యానికి ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇలా చేయాలి..!

Ulavacharu : పూర్వ కాలం నుండి వంటింట్లో ఉప‌యోగించే వాటిల్లో ఉల‌వ‌లు ఒక‌టి. ఉల‌వ‌ల‌ను త‌రుచూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఉల‌వ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌గ వారిలో శుక్ర క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంలో కూడా ఉల‌వ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలోనూ ఉల‌వ‌లు దోహ‌ద‌ప‌డ‌తాయి. కాలేయ పని తీరును మెరుగు ప‌రుస్తాయి. మూత్ర పిండాల‌లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు ఉల‌వ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో తీసుకోవ‌డం వల్ల ఈ స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Ulavacharu gives many benefits cook in this method
Ulavacharu

ఉల‌వ‌లను మ‌నం ఎక్కువ‌గా గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటూ ఉంటాం. ఉల‌వ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే చారును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల‌వ‌ల‌తో చారును త‌యారు చేసుకునే విధానం చాలా మందికి తెలియ‌దు. క‌నుక ఉల‌వ‌ల చారును ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల‌వ‌ చారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉల‌వ‌లు – పావు కిలో, చింత పండు – 15 గ్రా., జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్‌, మిరియాలు – ఒక టీ స్పూన్‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్‌, ఆవాలు – ఒక టీ స్పూన్‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్‌, మెంతులు – 5 లేదా 6, ఎండు మిర్చి – 3 లేదా 4, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

ఉల‌వ‌ చారు త‌యారీ విధానం..

ముందుగా ఉల‌వ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌గినన్ని నీళ్ల‌ను పోసి 6 గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. చింత పండును కూడా నాన‌బెట్టుకుని గుజ్జును తీసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్క‌ర్ లో ఉల‌వ‌ల‌ను నాన‌బెట్టుకున్న నీటితోపాటు ఉల‌వ‌ల‌ను కూడా వేసి మ‌రి కొన్ని నీటిని పోసుకుని మూత పెట్టి ఉల‌వ‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఉల‌వ‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత ఉల‌వ‌లను, నీటిని జ‌ల్లి గిన్నె స‌హాయంతో వేరు చేసుకోవాలి. ఇలా వేరు చేసిన నీటిని పారబోయ‌కూడ‌దు.

ఇప్పుడు ఒక జార్ లో ధ‌నియాల‌ను, జీల‌క‌ర్ర‌ను, మిరియాల‌ను వేసి బ‌ర‌క‌గా ప‌ట్టుకోవాలి. త‌రువాత వీటిలోనే వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో ఒక టేబుల్ స్పూన్ ఉడికించి పెట్టుకున్న ఉల‌వ‌ల‌ను వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి కాగాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, మెంతులు, ఎండు మిర్చి, త‌రిగిన ప‌చ్చి మిర్చి వేసి తాళింపు చేసుకోవాలి. ఇవి వేగాక త‌రిగిన ట‌మాటా ముక్క‌లు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.

ట‌మాట ముక్క‌లు స‌గం వ‌ర‌కు ఉడికాక ప‌సుపు, రుచికి స‌రిప‌డా ఉప్పు, ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న వెల్లుల్లి మిశ్ర‌మాన్ని వేసి క‌లిపి మూత పెట్టి ట‌మాటాలు పూర్తిగా ఉడికే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ట‌మాటా ముక్క‌లు ఉడికిన త‌రువాత ముందుగా చేసి పెట్టుకున్న చింత పండు గుజ్జును, మెత్త‌గా చేసి పెట్టుకున్న ఉల‌వ‌లను, స‌రిప‌డా నీటిని పోసి కొద్దిగా మ‌రిగే వ‌ర‌కు ఉంచుకోవాలి. ఈ చారు కొద్దిగా మ‌రిగిన త‌రువాత ఉడికించిన‌ ఉల‌వ‌ల నుండి వేరు చేసిన నీటిని పోసి పూర్తిగా మ‌రిగించుకోవాలి. ఉల‌వ‌ల చారు పూర్తిగా మ‌రిగిన త‌రువాత చివ‌ర‌గా క‌రివేపాకును, త‌రిగిన కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల‌వ‌ చారు త‌యార‌వుతుంది. ఉడికించిన ఉల‌వ‌ల‌ను మ‌నం చారు త‌యారీలో ఉప‌యోగించలేదు. ఈ ఉల‌వ‌ల‌ను తాళింపు చేసుకుని లేదా బెల్లం, పంచ‌దార‌తో క‌లిపి తిన‌వ‌చ్చు. వేడి వేడి అన్నంలో ఉల‌వ‌ల చారు, నెయ్యి వేసుకుని క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts