Ullipaya Rasam : మనం వంటల తయారీలో ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. ఉల్లిపాయ లేని వంటిల్లు ఉండనే ఉండదు. ఏ వంటకం చేసినా అందులో ఏదో ఒక రకంగా మనం ఉల్లిపాయలను ఉపయోగిస్తూనే ఉంటాం. ఉల్లిపాయలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇతర వంటలలో ఉపయోగించడమే కాకుండా ఉల్లిపాయతో మనం ఎంతో రుచిగా రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు.
ఉల్లిపాయ రసం ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. ఉల్లిపాయలతో రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, చిన్నగా తరిగిన బంగాళా దుంపలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – అర టీ స్పూన్, టమాట గుజ్జు – ఒక కప్పు, చింత పండు రసం – తగినంత, మినప పప్పు – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, శనగ పప్పు – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి – ఒక టీ స్పూన్, కారం – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, శనగ పప్పు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 2, అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ.
ఉల్లిపాయ రసం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో మినప పప్పును, మెంతులను, జీలకర్రను, ఆవాలను, శనగ పప్పును వేసి దోరగా వేయించి జార్ లో వేసి పొడిలా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని దానిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలను, ఉప్పును, కరివేపాకును, తరిగిన పచ్చి మిర్చిని, పసుపును వేసి కలిపి మూత పెట్టి వేడి చేయాలి. నీరు వేడైన తరువాత టమాట గుజ్జును, చింతపండు రసాన్ని, ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని, కారాన్ని, ఎండు కొబ్బరిని వేసి మరిగించాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించి మరుగుతున్న రసంలో వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ రసం తయారవుతుంది. ఈ రసాన్ని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి కూడా మేలు కలుగుతుంది.