Athi Madhuram Veru : ఔషధ గుణాలు కలిగిన అనేక రకాల ఔషధ మొక్కల్లో అతి మధురం మొక్క కూడా ఒకటి. ఆయుర్వేదంలో ఈ మొక్క వేరును విరివిరిగా ఉపయోగిస్తారు. అతి మధురం వేరుతో అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అతి మధురం శాస్త్రీయ నామం గ్లైసరీసా గాబ్రా. అలాగే హిందీలో ములెట్టి అని, ఇంగ్లీష్ లో లెకోరీస్ అని పిలుస్తారు. అతి మధురం మొక్క 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్కకు ఉండే అతి తీపి కారణంగా దీనికి అతి మధురం అనే పేరు వచ్చింది. విరోచనాలు సాఫీగా అయ్యేలా చేయడంలో, దగ్గును తగ్గించడంలో, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఇలా అనేక రకాల ప్రయోజనాలను కలిగించగడంలో ఈ అతి మధురం వేరు మనకు సహాయపడుతుంది. అతి మధురం వేరు యొక్క ఔషధ గుణాలను అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో పండ్లను తగ్గించడంలో అతి మధురం వేరు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అతి మధురం చూర్ణాన్ని ఒకటి లేదా రెండు గ్రాముల మోతాదులో పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు, హైపర్ ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ వేరు చూర్ణాన్ని అర టీ స్పూన్ మోతాదులో నీటిలో వేసి కషాయంలా చేసుకుని తాగాలి. అలాగే అన్నాన్ని మెత్తగా వండుకుని తినాలి. ఇలా తీసుకోవడం వల్ల అల్సర్లు తగ్గుతాయి. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు, గొంతు శ్రావ్యంగా లేనప్పుడు, కఫం తొలగిపోకుండా దగ్గు వస్తూ ఉన్నప్పుడు అతి మధురం చూర్ణాన్ని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చిటికెడు అతి మధురం చూర్ణానికి తేనెను కలిపి చప్పరించి మింగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే మలబద్దకం సమస్యను తగ్గించడంలో కూడా అతి మధురం మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఒకటి లేదా రెండు గ్రాముల అతి మధురం వేరు పొడిని 3 లేదా 5 గ్రాముల బెల్లంతో కలిపి ఉండలా చేసుకుని తినాలి.
ఇలా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ అతి మధురం వేరు చూర్ణాన్ని వాడడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. అతి మధురం చూర్ణాన్ని అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఈ విధంగా తయారు చేసుకున్న కషాయాన్ని గోరు వెచ్చగా అయిన తరువాత నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటిపూత తగ్గుతుంది. అతి మధురం వేర్లను పాలు, కుంకుమ పువ్వుతో కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి.
అలాగే ఈ వేరు చూర్ణాన్ని వెన్నతో లేదా తేనెతో లేదా నెయ్యితో కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని లోనికి తీసుకోవడంతో పాటు కాలిన గాయాలపై రాయాలి. ఇలా చేయడం వల్ల కాలిన గాయాలు త్వరగా మానుతాయి. అలాగే దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికి దీనిని దీర్ఘకాలం పాటు వాడకూడదు. మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు, రక్తపోటు ఉన్న వారు దీనిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి. ఈ విధంగా అతిమధురం వేరు చూర్ణం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.