Karakkaya : మనందరికీ త్రిఫల చూర్ణం గురించి తెలుసు. త్రిఫల చూర్ణం తయారీలో ఉపయోగించే వాటిల్లో కరక్కాయ ఒకటి. కరక్కాయలో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనకు వచ్చే అనేక రకాల రోగాలను నయం చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కరక్కాయ వగరు, తీపి, చేదు రుచులతో శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. మనకు వచ్చే త్రిదోషాలను నయం చేయడంలో కరక్కాయ సహాయపడుతుంది. కరక్కాయను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మట్టి మూకుడులో చిన్న మంటపై వేయించి పొడిగా చేసిన కరక్కాయ బెరడు పొడి 5గ్రా. చొప్పున తీసుకుని దానికి సమపాళ్లలో పాత బెల్లాన్ని కలిపి గ్రీష్మ ఋతువులో సేవించాలి. అలాగే 5 గ్రా. ల కరక పొడిలో 3 గ్రా. సైంధవ లవణాన్ని కలిపి వర్ష ఋతువులో సేవించాలి. 5 గ్రా. కరక పొడిలో సమపాళ్లలో చక్కెరను కలిపి శరదృతువులో సేవించాలి. అలాగే 5 గ్రా. కరక పొడిలో 2 గ్రా. శొంఠి పొడిని కలిపి హేమంత ఋతువులో సేవించాలి. 5 గ్రా. కరక పొడిలో 2 గ్రా. దోరగా వేయించిన పిప్పళ్ల పొడిని కలిపి మంచి నీటితో శిశిర ఋతువులో సేవించాలి. అదే విధంగా 5 గ్రా. కరక పొడిలో ఒక టీ స్పూన్ తేనెను కలిపి వసంత ఋతువులో సేవించాలి. ఇలా ఆరు ఋతువుల్లో ఆరు రకాలుగా సేవించడం వల్ల నూరేళ్ల వరకు ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా నిండు యవ్వనంతో ఉంటారని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి.
కరక్కాయ పొడి 5 గ్రా. ల చొప్పున తీసుకుని దానికి బెల్లాన్ని కలిపి భోజనానికి గంట ముందు తింటూ ఉంటే రక్త మొలలు హరించుకుపోతాయి. 3గ్రా. కరక్కాయ పొడిని తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి తినడం వల్ల వాంతులు తగ్గుతాయి. కరక్కాయ పొడి 60 గ్రా., పిప్పళ్ల పొడి 30 గ్రా., దాల్చిన చెక్క పొడి 10 గ్రా., ఇంగువ పొడి 5 గ్రా. ల చొప్పున తీసుకుని కలిపి దోరగా వేయించి నిల్వ చేసుకోవాలి. పూటకు 3 గ్రా. ల చొప్పున రెండు పూటలా భోజనానికి అర గంట ముందు తింటూ ఉంటే ఆకలి బాగా పెరుగుతుంది. తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది.
కరక్కాయ పొడిని నాటు ఆవు నెయ్యి తో కలిపి నిల్వ చేసుకోవాలి. రెండు పూటలా 3 గ్రా. మోతాదులో తీసుకుంటూ ఉంటే శరీరం బలంగా తయారవుతుంది. మట్టి మూకుడులో కరక్కాయను నల్లగా అయ్యే వరకు వేయించి బూడిదలా చేసుకోవాలి. ఈ బూడిదలో నువ్వుల నూనెను కలిపి మరోసారి మెత్తగా నూరుకోవాలి. దీనిని వ్రణాలపై, గాయాలపై లేపనంగా రాస్తూ ఉంటే అవి త్వరగా మానుతాయి.
కరక్కాయ బెరడును మంచి నీటితో కలిపి మెత్తగా నూరి ఒంటికి నలుగులా పెట్టుకుని ఆరిన తరువాత స్నానం చేయడం వల్ల అతి చెమట సమస్య తగ్గుతుంది. కరక్కాయ బెరడు పొడి 20గ్రా., ధనియాల పొడి 50 గ్రా. పటిక బెల్లం పొడి 70 గ్రా. లచొప్పున తీసుకుని వీటన్నింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా ఒక టీ స్పూన్ పొడిని ఒక గ్లాస్ మంచి నీటితో కలిపి భోజనం తరువాత తీసుకుంటూ ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఉదయం పూట సుఖ విరోచనం అవుతుంది.
లేత కరక్కాయ పిందలను నేతిలో వేయించి ఎండబెట్టి పొడిలా చేసి పూటకు మూడు చిటికెళ్ల పరిమాణంలో తీసుకుని నీటిలో కలిపి తాగిస్తూ ఉంటే పిల్లల్లో వచ్చే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా కరక్కాయను ఉపయోగించి మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు మాత్రం కరక్కాయను ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.