Sapota Juice : మనం ఆహారంగా తీసుకునే పండ్లలో సపోటా పండ్లు కూడా ఒకటి. సపోటా పండ్లు తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. ఇతర పండ్ల లాగా సపోటా పండ్లు కూడా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో సపోటా ఎంతో ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సపోటా పండ్లు సహాయపడతాయి.
జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో సపోటా ఎంతగానో దోహదపడుతుంది. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సపోటా పండ్లతో ఎంతో రుచిగా ఉండే జ్యూస్ ను తయారు చేస్తుంటారు. సపోటా పండ్లతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సపోటా జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సపోటా పండ్లు – 3, పాలు – అర కప్పు, పంచదార – పావు కప్పు, నీళ్లు – ఒక కప్పు, ఐస్ క్యూబ్స్ – తగినన్ని.
సపోటా జ్యూస్ తయారీ విధానం..
ముందుగా సంపోటా పండ్లను ముక్కలుగా చేసుకోవాలి. తరువాత జార్ లో ఈ ముక్కలను, పాలను, పంచదారను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత నీళ్లను, ఐస్ క్యూబ్స్ ను వేసి మరో మిక్సీ పట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చల్ల చల్లగా ఎంతో రుచిగా ఉండే సపోటా జ్యూస్ తయారవుతుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని తగ్గించడంలో ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా సపోటాను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.