Arthritis Pains : రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతుంది. చలికాలంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పటికి వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మాత్రం ఇది తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. ముఖ్యంగా కీళ్ల వాతం సమస్యతో బాధపడే వారు చలికాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చల్లటి వాతావరణం కారణంగా శరీరంలో అనేక మార్పులు వస్తాయి. దీంతో నొప్పులు మరింత ఎక్కువవుతాయి. ముఖ్యంగా చేతివేళ్లల్లో, కాలి వేళ్లల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. చల్లటి వాతావరణం కారణంగా కండరాలు బిగుసుకు పోతాయి. కీళ్లను కదిలించడం చాలా కష్టమవుతుంది.
దీంతో రోజూ వారి పనులు చేసుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే గాలిలో తక్కువగా ఉండే తేమ కూడా కీళ్లవాతంతో బాధపడే వారికి నొప్పిని తీవ్రతరం చేస్తుంది. వాతావరణంలో ఉండే ఈ తడి, పొడి గాలులు కీళ్లను డీహైడ్రేట్ చేసి నొప్పిని మరింత ఎక్కువగా చేస్తాయి. దీంతో కీళ్ల వాతంలో బాధపడే వారు రోజంతా నీరసంగా కనిపిస్తారు. నొప్పుల కారణంగా శరీరాన్ని కదిలించలేకపోతారు. అయితే కీళ్లవాతంతో బాధపడే వారు చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంవల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
కీళ్లవాతంతో బాధపడే వారు ఎల్లప్పుడూ వెచ్చని దుస్తులను ధరించాలి. దీంతో కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. అలాగే చేతులకు, తలకు, చెవులకు టోపీలు, తొడుగులు ధరించాలి. అలాగే శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. దీని కోసం యోగా, ఈత కొట్టడం, వ్యాయామాలు చేయడం వంటివి చేయాలి. అలాగే వేడి నీటితో స్నానం చేయాలి. వేడి నీటితో కీళ్లపై కాపడం పెట్టుకుంటూ ఉండాలి. అలాగే అధిక బరరువు నొప్పులను మరింత తీవ్రతరం చేస్తుంది. కనుక బరువు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీంతో కీళ్లపై బరువు ఎక్కువగా పడకుండా ఉంటుంది. అలాగే కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలను తీసుకోవాలి.
క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను, తృణ ధాన్యాలను, డ్రై ఫ్రూట్స్ ను, పండ్లను, కూరగాయలను తీసుకోవాలి. జంక్ ఫుడ్ ను తక్కువగా తీసుకోవాలి. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి ఉండేలా చూసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరానికి నొప్పిని తట్టుకునే శక్తి వస్తుంది. రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. కీళ్లవాతంతో బాధపడే వారు ఈ విధంగా చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు ఎక్కువ కాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.