Shanaga Pindi Sweet : శనగపిండితో పిండి వంటకాలు, చిరుతిళ్లతో పాటు స్వీట్స్ ను కూడా తయారు చేస్తూ ఉంటాము. శనగపిండితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. శనగపిండితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో మోహన్ థాల్ స్వీట్ కూడా ఒకటి. ఇది మనకు స్వీట్ షాపుల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ స్వీట్ ను ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉండే ఈ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపిండి స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి- 2 కప్పులు, కరిగించిన నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, గోరు వెచ్చని పాలు – 3 టేబుల్ స్పూన్స్, ఫుడ్ కలర్ – కొద్దిగా, పాలు – పావు కప్పు, పంచదార – ఒక కప్పు, నీళ్లు – 1/3 కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
శనగపిండి స్వీట్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నెయ్యి, పాలు పోసికలపాలి. తరువాత మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఈ పిండిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో ముప్పావు కప్పు నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మిక్సీ పట్టుకున్న శనగపిండి వేసి కలపాలి. దీనిని 10 నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తరువాత ఫుడ్ కలర్, పావు కప్పు పాలు పోసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి ముదురు తీగపాకం వచ్చిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత యాలకుల పొడి వేసి కలుపుతూ వేడి చేయాలి. ఈ మిశ్రమం కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు కలుపుతూ వేయించాలి. ఇలా శనగపిండి మిశ్రమం తయారవ్వగానే దీనిని నెయ్యి, బటర్ పేపర్ వేసిన ట్రేలోకి తీసుకోవాలి. తరువాత దీనిని పైన సమానంగా చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని మనకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపిండి స్వీట్ తయారవుతుంది. ఈ స్వీట్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.