అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. శరీరానికి పోషణను అందిస్తాయి. అందువల్ల అరటి పండ్లను తరచూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే అరటి పండ్ల వల్ల మన చర్మాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బాగా పండిన అరటి పండును ఒకటి తీసుకుని లోపలి గుజ్జు తీసి దాన్ని ఒక బౌల్‌లో వేసి మరింత మెత్తగా, గుజ్జులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 10-15 నిమిషాలు ఆగాక చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం మృదువుగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవారికి ఈ చిట్కా ఎంతగానో మేలు చేస్తుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది.
2. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి కూడా అరటిపండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. అందుకు గాను ఒక బాగా పండిన అరటి పండును తీసుకుని దాంట్లోని గుజ్జును తీయాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమానికి ముఖానికి ఫేస్ మాస్క్‌లా వేయాలి. 1 గంట సేపు ఆగాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జిడ్డు చర్మం నుంచి బయట పడవచ్చు. చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. మెరుస్తుంది.
3. అరటి పండులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. అంటే ముఖంపై చర్మాన్ని ముడతలు పడనీయదు. దీంతో వృద్దాప్య ఛాయలు త్వరగా రావు. అందుకు గాను ఒక బాగా పండిన అరటి పండును తీసుకుని అందులోని గుజ్జును తీసి బాగా మెత్తగా చేయాలి. అందులో 1 టీస్పూన్ నారింజ జ్యూస్, 1 టీస్పూన్ పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి. కొంత సేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, ముడతలు పోతాయి. యవ్వనంగా కనిపిస్తారు.
4. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై నేరుగా రాయవచ్చు. సున్నితంగా మర్దనా చేసినట్లు అప్లై చేయాలి. కొంత సేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.
5. బాగా పండిన అరటి పండు గుజ్జును మరింత మెత్తగా చేసి ముఖానికి రాసి కొంతసేపు ఆగాక కడిగేస్తే ముఖంపై ఉండే డార్క్ స్పాట్స్, నల్లని వలయాలు కూడా పోతాయి. ముఖం అందంగా కనిపిస్తుంది.
6. కళ్లు ఉబ్బిపోయి ఉంటే అరటి పండు తొక్క లోపలి భాగాన్ని కనురెప్పలపై వేసి ఉంచాలి. 15 నిమిషాలు ఆగి తీసేయాలి. తరువాత కళ్లను కడుక్కోవాలి. ఇలా చేస్తుంటే కళ్ల వాపులు తగ్గుతాయి.