Curd For Face : మనం ప్రతిరోజూ పెరుగును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఎముకలను ధృడంగా ఉంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెండచంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా పెరుగు మనకు సహాయపడుతుంది. మన శరీర ఆరోగ్యంతో పాటు మన ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా పెరుగు మనకు దోహదపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు, యాంటీ ఇన్ ప్లామేషన్ గుణాలు మన చర్మ సమస్యలను తగ్గించి ముఖాన్ని అందంగా కనబడేలా చేయడంలో సహాయపడతాయి. పెరుగును ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే మచ్చలను, మొటిమలను, నలుపుదనాన్ని మనం చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
అయితే పెరుగును ఎలా వాడడం వల్ల మనం మన ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగును మన చర్మ తత్వాన్ని బట్టి వాడాలి. జిడ్డు చర్మం ఉన్న వారు పుల్లటి పెరుగును అలాగే పొడి చర్మం ఉన్న వారు తియ్యటి మీగడ పెరుగును ఉపయోగించాలి. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమపిండి బ్లీచింగ్ ఏజెంట్ లాగా పని చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు కలిసేలా బాగా కలపాలి. జిడ్డు చర్మం ఉన్న వారు ఇందులో నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగించే ముందు చర్మాన్ని శుభ్రంగా కడగాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. కొద్దిగా ఆరిన తరువాత సున్నితంగా మర్దనా చేసుకోవాలి.
తరువాత పూర్తిగా ఆరే వరకు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, నలుపుదనం, మృత కణాలు తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది. అలాగే చర్మానికి కావల్సిన తేమ అంది చర్మం పొడి బారకుండా ఉంటుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించడం వల్ల మనం మరింత చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.