Palakura Challa Pulusu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలకూరతో ఎక్కువగా మనం పప్పు, కూర వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాం. కానీ పాలకూరతో మనం ఎంతో రుచిగా ఉండే చల్ల పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. పెరుగు, పాలకూర కలిపి చేసే ఈ చల్ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. కేవలం పది నిమిషాల్లోనే దీనిని మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పాలకూర చల్ల పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పాలకూర చల్ల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – 3 కట్టలు, నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పచ్చిమిర్చి – 5, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన ఉల్లిపాయ – 1, పెరుగు – అర కప్పు, శనగపిండి – 2 టీ స్పూన్స్.
పాలకూర చల్ల పులుసు తయారీ విధానం..
ముందుగా పెరుగులో శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. అలాగే పచ్చిమిర్చిని పేస్ట్ గా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత తరిగిన పాలకూర, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి పాలకూరను ఉడికించాలి. పాలకూర చక్కగా ఉడికిన తరువాత పెరుగు, శనగపిండి మిశ్రమం వేసి కలపాలి. ఈ చల్ల పులుసు మరీ గట్టిగా ఉంటే తగినన్ని నీళ్లు పోసుకుని కలపాలి.
తరువాత దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకూర చల్ల పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చల్ల పులుసును తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ చల్ల పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.