Ghee Night Cream : పాల నుండి తయారు చేసే వాటిల్లో నెయ్యి కూడా ఒకటి. నెయ్యిని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంటల్లో, తీపి వంటకాల తయారీలో ఇలా అనేక రకాలుగా నెయ్యిని తీసుకుంటూ ఉంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా నెయ్యిని అందరూ ఇష్టంగా తింటారు. నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. నెయ్యిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే నెయ్యి కేవలం మన ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిని నేరుగా తీసుకోవడానికి బదులుగా దీనితో క్రీమ్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. నెయ్యితో తయారు చేసిన ఈ క్రీమ్ ను వాడడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం సహజంగా కాంతివంతంగా తయారవుతుంది.
అలాగే గాయాలు తగిలినప్పుడు ఈ క్రీమ్ ను రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. నెయ్యితో క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలి… అలాగే ఈ క్రీమ్ ను రాసుకోవడం వల్ల మనకు కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్రీమ్ ను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. తరువాత ఇందులో 3 ఐస్ క్యూబ్స్ వేసి స్పూన్ తో బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల కొద్ది సమయానికి నెయ్యి క్రీమ్ లాగా మారుతుంది. దీనిలో ఉండే నీటిని తీసేసి క్రీమ్ ను డబ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న క్రీమ్ ను రోజూ రాత్రి నిద్రపోయే ముందు చర్మానికి రాసుకోవాలి. ఈ క్రీమ్ ను రాసుకునే ముందు చర్మం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఈ క్రీమ్ ను రాసుకుని సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.
అందంగా, కాంతివంతంగా తయారువుతుంది. ఈ క్రీమ్ ను రాసుకోవడం వల్ల చర్మంపై ఉండే వాపు కూడా తగ్గుతుంది. నెయ్యిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే నెయ్యిలో ఉండే ఈ లక్షణాల కారణంగా చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి. చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ క్రీమ్ ను రాసుకోవడం వల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది. చర్మంపై ఉండే ముడతలు తగ్గుతాయి. వృద్దాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా నెయ్యి మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నెయ్యితో క్రీమ్ ను తయారు చేసి వాడడం వల్ల చక్కటి అందమైన, ఆరోగ్యవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.