Castor Oil : ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అని పెద్దలు చెబుతుంటారు. కానీ చెట్టు అన్న చోట కూడా ఆముదం చెట్టే మహా వృక్షమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆముదం చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆముదాన్ని ఇంగ్లీష్ లో కాస్టర్ ఆయిల్ అని సంస్కృతంలో ఏరండా అని పిలుస్తారు. అలాగే దీని శాస్త్రీయ నామం రెసినస్ ఫెమ్యునిస్. ఆముదం చెట్టు సంవత్సరం పాటు మాత్రమే పెరుగుతుంది. దాదాపు 1 నుండి 7 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అలాగే ఆముదం చెట్టు ఆకులు వెడల్పుగా ఉంటాయి. అలాగే ఏ నేలలోనైనా ఈ మొక్క సులభంగా పెరుగుతుంది. ఆముదం మొక్కలో ప్రతి భాగం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుండే ఈ మొక్క మన దేశంలో ఉందని ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొనబడింది. ఆముదం నూనె విరేచనకారిగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆముదం నూనె చర్మం పొడిబారకుండా చేయడంలో అలాగే ఎండ నుండి చర్మం దెబ్బతినకుండా చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆముదం ఆకులను దంచి వేడి చేసి మూట కట్టాలి. ఇలా వేడి చేసిన ఆకులతో వాపు, నొప్పులు ఉన్న చోట కాపడం పెట్టుకోవడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాలింతల్లో ఎక్కువగా కనిపించే సమస్యల్లో పాలగడ్డల సమస్య ఒకటి. ఈ సమస్య వేధిస్తున్నప్పుడు ఆముదం నూనెను గోరు వెచ్చగా చేసి రొమ్ములపై రాయాలి. తరువాత చేత్తో సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది.
అలాగే మనలో చాలా మందిని వేధిస్తున్న జుట్టు సంబంధిత సమస్యల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. ఆముదం నూనెను వాడడం వల్ల చుండ్రు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. తలకు ఆముదం నూనెను పట్టించి ఒక గంట తరువాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అలాగే తలకు ఆముదాన్ని రాసుకోవడం వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అదే విధంగా ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు ఒక గ్లాస్ పాలల్లో రెండు టీ స్పూన్ల ఆముదాన్ని కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్న గంట తరువాత విరోచనాలు అవ్వడం ప్రారంభమవుతుంది. విరోచనాలు మరీ ఎక్కువగా అవుతూ ఉంటే వేడి నీళ్లు తాగాలి. పాలతో ఆముదాన్ని తీసుకోవడం ఇష్టం లేని వారు అల్లం రసంతో కూడా తీసుకోవచ్చు. అలగే చర్మం పొడిఅనే సమస్యతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
అలాంటి వారు స్నానానికి ముందు చర్మానికి ఆముదాన్ని రాసి మర్దనా చేసుకోవాలి. తరువాత సున్నిపిండితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. ఆముదంతో లాభాలు ఉన్నప్పటికి దీనితో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు ఆముదాన్ని విరేచణకారిగా ఉపయోగించరాదు. అలాగే కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడే వారు, గర్భిణీ స్త్రీలు కూడా ఆముదాన్ని లోనికి తీసుకోకూడదు. ఈ విధంగా ఆముదం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.