Chest Pain Because Of Gas : సాధారణంగా చాలా మందికి తరచూ గ్యాస్ సమస్య వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కారణం ఏమున్నా సరే గ్యాస్ సమస్య వచ్చిందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కోసారి నోట్లో నుంచి గ్యాస్ బయటకు వస్తుంది. ఒక్కోసారి ఆపాన వాయువు రూపంలో బయటకు వస్తుంది. అయితే ఇలా గ్యాస్ బయటకు వెళ్లిపోతే ఆరోగ్యకరమే. కానీ గ్యాస్ బయటకు వెళ్లని పక్షంలో శరీరంలోనే తిరుగుతుంది. దీంతో శరీరంలో పలు భాగాల్లో నొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. అయితే సాధారణంగా చాలా మంది దీన్ని గుండె నొప్పిగా భావిస్తారు.
మీకు గనక ఛాతిలో నొప్పి ఉంటే అది గుండె నొప్పి కాకపోతే అప్పుడు మీరు కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ నొప్పి నుంచి సులభంగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల అల్లం గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గ్యాస్ వల్ల ఛాతిలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. ఇందుకు ఏం చేయాలంటే కొద్దిగా అల్లాన్ని తీసుకుని నీటిలో వేసి మరిగించి తాగాలి. అందులో రుచి కోసం తేనె కలుపుకోవచ్చు. లేదా భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను తినవచ్చు. లేదా ఒక టీస్పూన్ అల్లం రసం సేవించవచ్చు. దీంతో గ్యాస్ సమస్య ఉత్పన్నం అవదు.
బేకింగ్ సోడా సహజసిద్ధమైన అంటాసిడ్‌లా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయంలో ఉండే యాసిడ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో కడుపు నొప్పి, పొట్టలో గ్యాస్, ఛాతిలో గ్యాస్ వల్ల వచ్చే నొప్పి అన్నీ తగ్గిపోతాయి. ఇక ఇందుకు ఏం చేయాలంటే.. ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడాను కలిపి తాగాలి. దీంతో సమస్య నుంచి బయట పడవచ్చు.
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సోంపు గింజలు ఎంతగానో పనిచేస్తాయి. వీటిల్లో ఉండే సమ్మేళనాలు జీర్ణాశయాన్ని ప్రశాంత పరుస్తాయి. దీంతో జీర్ణాశయంలో దాగి ఉండే గ్యాస్ బయటకు వస్తుంది. ఫలితంగా గ్యాస్ తగ్గిపోతుంది. ఇక గ్యాస్ సమస్యను తగ్గించుకునేందుకు సోంపు గింజలను భోజనం చేసిన అనంతరం ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తినవచ్చు. లేదా ఈ గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను గోరు వెచ్చగా తాగవచ్చు. ఇలా కూడా గ్యాస్ తగ్గిపోతుంది.
గ్యాస్ సమస్యను తగ్గించడంలో నిమ్మకాయ నీళ్లు కూడా పనిచేస్తాయి. నిమ్మరసంలో ఉండే సమ్మేళనాలు మన జీర్ణాశయంలో జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తాయి. దీంతోపాటు బైల్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల మనం తిన్న ఆహారం జీర్ణాశయం, పేగుల్లో సులభంగా కదులుతుంది. ఫలితంగా అక్కడ ఉండే గ్యాస్ చాలా సులభంగా బయటకు వస్తుంది. దీంతో గ్యాస్ తగ్గిపోతుంది. కనుక ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసాన్ని కలిపి తాగితే గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే జీర్ణక్రియ పెరుగుతుంది. అయితే దీన్ని ఉదయం పరగడుపున తాగితే మంచిది.
భోజనం చేసిన తరువాత 15 నిమిషాలు ఆగి వాకింగ్ చేయాలి. 10 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేస్తే గ్యాస్ ఏర్పడదు. అలాగే గ్యాస్ వల్ల ఛాతిలో వచ్చే నొప్పి సైతం తగ్గిపోతుంది. గ్యాస్ సమస్యను తగ్గించేందుకు వాకింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎప్పుడైనా భోజనం చేసిన అనంతరం కాస్త గ్యాప్ ఇచ్చి చేయవచ్చు. ఇక కమోమిల్ టీని తాగడం వల్ల కూడా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో గ్యాస్ సమస్య తగ్గుతుంది. గ్యాస్ వల్ల ఛాతిలో వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే గ్యాస్ తగ్గిపోవడంతోపాటు దాంతో ఛాతిలో వచ్చే నొప్పి తగ్గిపోతుంది. అయితే మీకు వచ్చింది గ్యాస్ నొప్పి కాకపోతే వెంటనే డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.