Fenugreek Seeds Water For Hair : మన వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. మెంతుల్లో ఔషధ గుణాలు, ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. కేవలం మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా మెంతులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మెంతులతో నీటిని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చక్కటి అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. మెంతులతో నీటిని ఎలా తయారు చేసుకోవాలి..అలాగే ఈ నీటిని ఎలా ఉపయోగించాలి.. మెంతుల నీటిని జుట్టుకు ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నీటిని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా మనం ఒక గిన్నెలో మన జుట్టుకు సరిపడినన్ని మెంతులను తీసుకోవాలి. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల మెంతులను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక గ్లాస్ నీటిని పోయాలి. తరువాత ఈ మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన మెంతులను గిన్నెతో సహా స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. ఈ నీటిని 5 నుండి 10 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని చల్లగా అయ్యే వరకు ఉంచి వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మెంతుల నీళ్లు తయారయ్యాయి. ఈ నీటిలో అర చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఈ నీటిలో దూదిని ముంచి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. దూదిని వాడడం ఇబ్బందిగా ఉన్న వారు స్ప్రే బాటిల్ ల్లో ఈ నీటిని పోసుకుని జుట్టు కుదుళ్లపై స్ప్రే చేసుకోవాలి.
ఇలా మెంతుల నీటిని జుట్టు కుదుళ్లకు పట్టించిన తరువాత మర్దనా చేసుకోవాలి. తరువాత దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపులతో తలస్నానం చేయాలి. అయితే మెంతుల నీటిని జుట్టు కుదుళ్లకు పట్టించేటప్పుడు జుట్టుకు నూనె లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా మెంతుల నీటిని వారినికి ఒకసారి జుట్టు కుదళ్లకు పట్టించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. దెబ్బతిన్న వెంట్రుకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు బలంగా పెరగడంతో పాటు కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు తెల్లబడకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా మెంతులతో నీటిని తయారు చేసుకుని వాడడం వల్ల మన చక్కటి ఒత్తైన, నల్లటి జుట్టును సొంతం చేసుకోవచ్చు.