Hair Problems : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు నల్లగా, ఒత్తుగా, ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వాతావరణ కాలుష్యం, సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వల్ల జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. జుట్టు రాలడం, జుట్టు పొడి బారడం, జుట్టు చివర్లు చిట్లడం, చుండ్రు, జుట్టు పెరగక పోవడం వంటి వాటిని మనం జుట్టు సంబంధిత సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ సమజ్యలు తగ్గి జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండాలని మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపూలను, నూనెలను, కండిషనర్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే కలుగుతుంది. పైగా ఇవి అధిక ధరలు కలిగి ఉంటాయి.
ఎటువంటి ఖర్చు లేకుండా సహజ సిద్ధంగానే ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం జుట్టు సంబంధిత సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చు. జుట్టును ఒత్తుగా, నల్లగా, ఆరోగ్యంగా ఉంచే ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో పెరుగు, నిమ్మరసం మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక కప్పు పెరుగులో కొద్దిగా నిమ్మ రసాన్ని, కోడిగుడ్డు తెల్ల సొననువేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి లేపనంగా రాసి ఆరిన తరువాత కడిగేయాలి. ఇందులో వాడే పెరుగు చుండ్రును నివారించడంలో, అలాగే తెల్లసొన జుట్టుకు మాయిశ్చరైజర్ లా పని చేసి జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే జుట్టును నల్లగా, ఒత్తుగా ఉంచడంలో మెంతులు, పెసర్లు మనకు సహాయపడతాయి. రెండు టేబుల్ స్పూన్ల చొప్పున మెంతులను, పెసర్లను నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు వీటిని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో గుడ్డు తెల్ల సొనతో పాటు రెండు టీ స్పూన్ల శీకాకాయ పొడిని కలిపి షాంపూలా ఉపయోగించాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా చుండ్రు, దురదల వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే జుట్టు చివర్లు చిట్లడం, జుట్టు తెగిపోవడం వంటి సమస్యలతో బాధపడే వారు చాలా మందే ఉంటారు. బాగా మగ్గిన అరటి పండ్లను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
ముందుగా రెండు బాగా మగ్గిన అరటి పండ్లను తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. తరువాత అందులో రెండు కోడిగుడ్ల తెల్ల సొన, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, విటమిన్ ఇ నూనెను వేసి కలిపి జుట్టు మొత్తానికి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి కుదుళ్లలోకి ఇంకేలా బాగా మర్దనా చేయాలి. ఇలా చేసిన గంట తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం వల్ల జుట్టు చివర్లు చిట్లడం తగ్గడంతోపాటు జుట్టు కాంతివంతంగా కూడా తయారవుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు తగ్గడంతోపాటు జుట్టు నల్లగా, ఒత్తుగా, నిగనిగలాడుతూ ఉంటుంది.