Lose Motions : సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల లేదా మనం తీసుకోకూడని ఆహారం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు కడుపులో తీవ్ర ఇబ్బందులు తలెత్తి విరేచనాలకు దారి తీస్తాయి. ఈ విధంగా తరచు విరేచనాలు కావడంతో అలసట, నీరసం వస్తాయి. ఈ క్రమంలోనే విరేచనాలను తగ్గించుకోవడం కోసం ఎన్నో మాత్రలను ఉపయోగిస్తాము. ఎన్ని మాత్రలు వేసుకున్న ప్పటికీ కొందరిలో ఈ విరేచనాలు ఎంతకీ తగ్గవు. ఈ విధంగా విరేచనాల సమస్యతో బాధపడేవారు లేదా తరచూ విరేచనాలు అయ్యేవారు ఈ చిట్కాల ద్వారా విరోచనాలకు స్వస్తి చెప్పవచ్చు.
తీవ్రమైన విరేచనాలతో బాధపడేవారికి మన వంటింట్లో లభించే దాల్చిన చెక్క, తేనె ఒక చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలోకి దాల్చిన చెక్క పొడి అర టీ స్పూన్,ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి తాగటంతో తొందరగా విరేచనాలు నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా అరటి పండు లేదా పెరుగులోకి అర టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడిని కలుపుకుని తినడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.
తీవ్రమైన విరేచనాలు కావడంతో మనలో చాలా నీరసం వస్తుంది. అదేవిధంగా మన శరీరంలో నీటి శాతాన్ని కోల్పోయి శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది.ఇలాంటి సమయంలో మన శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి కొబ్బరినీళ్లు ఎంతగానో దోహదపడతాయి కనుక కొబ్బరి నీళ్లు తాగడం ఎంతో ఉత్తమం. అలాగే విరేచనాలను కట్టడి చేయడం కోసం గడ్డ పెరుగు కూడా దోహదపడుతుంది. ఎంతకీ విరేచనాలు తగ్గకపోతే రోజుకు 2 నుంచి 3 కప్పుల గడ్డపెరుగు తినడంతో విరేచనాలకు చెక్ పెట్టవచ్చు.