జీవనం గడపడానికి, భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి డబ్బు అవసరం. వీలైనంత ఎక్కువ సంపాదించాలని, సేవింగ్స్ చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. కానీ అందరూ ఈ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఆదాయం తక్కువగా ఉండటం, అవసరాలు పెరగడం, సరైన పెట్టుబడులు చేయకపోవడంతో నష్టపోతుంటారు. సంపదను నిర్మించడానికి సమయం, తెలివైన నిర్ణయాలు, క్రమశిక్షణ చాలా అవసరం. మీరు కూడా మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే కొన్ని గోల్డెన్ రూల్స్‌తో సంపదను వృద్ధి చేసుకోవచ్చు. మిమ్మల్ని ధనవంతులుగా మార్చే ఆ 9 రూల్స్ ఏవో చూడండి. మనీ మేనేజ్‌మెంట్‌లో బడ్జెట్‌పై ఫోకస్ చేయడం అనేది బేసిక్ రూల్. మంచి బడ్జెట్ ప్లానింగ్.. మీరు ఎంత సంపాదిస్తారు, ఎంత ఖర్చు చేస్తారు అనేది చూపుతుంది. మీ ఖర్చులను ట్రాక్ చేయడం ద్వారా, మీ డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చూడవచ్చు. మరిన్ని ఆదా చేసే మార్గాలను కనుగొనవచ్చు. బడ్జెట్‌కు కట్టుబడి ఉంటే ఖర్చులను తగ్గించుకోవచ్చు.
ఖర్చుకు ముందు సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ చేతికి జీతం అందిన వెంటనే కొంత భాగాన్ని సేవింగ్స్‌కి కేటాయించండి. దీని కోసం ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యే ఆప్షన్ ఉపయోగించవచ్చు. కాలక్రమేణా ఇదో అలవాటుగా మారుతుంది. మీ స్థాయిలో జీవించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే మీరు సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు చేయాలి. ఇది మరింత ఆదా చేయడంతో పాటు ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. మీకు అవసరం లేని విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయకండి. స్వల్పకాలిక ఆనందాల కోసం ఖర్చు చేయడం కంటే దీర్ఘకాలిక సంపదను నిర్మించడంపై దృష్టి పెట్టండి. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, కాంపౌండింగ్ ఎనర్జీ ద్వారా మీ డబ్బు అంత వేంగా పెరుగుతుంది. చిన్న మొత్తాల్లో చేసే పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇందుకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర ఆప్షన్స్ ఎంచుకోండి. ముందుగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి, క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడితే సక్సెస్ అవుతారు.
క్రెడిట్ కార్డ్ డెట్ వంటివి అధిక వడ్డీలతో మీ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తాయి. లైమ్ లిమిట్ లోపు బ్యాలెన్స్ రీపేమెంట్ చేయకపోతే, భారీగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందుకు ఇలాంటి అధిక వడ్డీలు వర్తించే లోన్లను వీలైనంత త్వరగా చెల్లించడానికి ప్రయత్నించండి. మీకు నిజంగా సహాయపడే హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ కాకుండా మరో లోన్ తీసుకోవద్దు. రోజువారీ జీవితంలో చాలా వస్తువులు కొంటుంటాం. ఇలాంటప్పుడు బేరమాడి కొనడం నేర్చుకోవాలి. మంచి డీల్, ఆఫర్ కోసం అడగడానికి భయపడకండి. ఇలా పెద్ద కొనుగోళ్లు, బిల్లులపై డబ్బు ఆదా చేయవచ్చు. ఆర్థిక ప్రపంచం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది, కాబట్టి ఎల్లప్పుడూ నేర్చుకోవడం ముఖ్యం. పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మార్కెట్ ట్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీ నాలెడ్జ్ మెరుగుపరచుకోవడానికి పుస్తకాలను చదవండి, ఫైనాన్షియల్ వర్క్‌షాప్‌లకు హాజరవ్వండి. లేదా ప్రొఫెషనల్స్‌ని ఫాలో అవ్వండి. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు.
అత్యవసరాల్లో ఎమర్జెన్సీ ఫండ్ అప్పుల నుంచి కాపాడుతుంది. వైద్య అవసరాలు, జాబ్ పోవడం, కారు రిపేరు వంటి ఊహించని ఖర్చులకు ఉపయోగపడుతుంది. మూడు నుంచి ఆరు నెలల జీవన వ్యయాలను కవర్ చేయడానికి ఎమర్జెన్సీ ఫండ్ మెయింటెన్ చేయండి. కష్ట సమయాల్లో క్రెడిట్ కార్డ్‌లు లేదా రుణాలపై ఆధారపడకుండా రక్షిస్తుంది. పన్నులను ఎలా ఆదా చేసుకోవాలో అర్థం చేసుకోవడం వల్ల మీ డబ్బును కాపాడుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) లేదా పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఉపయోగించుకోండి. పన్నులను తగ్గించడం ద్వారా, మరింత ఆదా చేసుకోవచ్చు, సంపదను వేగంగా వృద్ధి చేసుకోవచ్చు.