అద్దె ఇండ్లలో ఉండే వారు ఎప్పటికైనా సొంత ఇంటిని కట్టుకోవాలని, లేదంటే కొనుక్కోవాలని కలలు కంటుంటారు. అందుకు వారి కోసం బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలను కూడా అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎవరైనా తాము కొనాలనుకునే ఇంటిని బట్టి, తమకు వస్తున్న ఆదాయానికి అనుగుణంగా ఇంటి రుణాలను తీసుకుంటుంటారు. అయితే కొందరు హోమ్ లోన్స్ తీసుకునేటప్పుడు పలు పొరపాట్లను చేస్తుంటారు. దీంతో తరువాతి కాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఈ క్రమంలోనే హోమ్ లోన్స్ తీసుకునేటప్పుడు ఎవరైనా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
1. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు సాధారణంగా ఎవరైనా సరే అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో విచారణ చేయాలి. లోన్‌కు ఎంత వడ్డీ వేస్తున్నారు, ఎంత ఈఎంఐ అవుతుంది, ఎలాంటి సదుపాయాలు ఉంటాయి.. అన్న వివరాలను సవివరంగా తెలుసుకున్నాకే.. మీకు నచ్చిన ఆర్థిక సంస్థ ద్వారా లోన్ తీసుకోవాలి. దీంతో తక్కువ వడ్డీతో ఇంటి రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొందరు ఇలా చేయరు. ఏదో ఒక బ్యాంకుకు వెళ్లడం, వివరాలు పూర్తిగా తెలుసుకోకుండా ఇంటి లోన్ తీసుకోవడం, ఆ తరువాత వడ్డీ ఎక్కువవుతుందని, మరే ఇతర సమస్యనో వచ్చిందని చెప్పి వాపోతుంటారు. కనుక అలా కాకుండా ఉండాలంటే.. అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల వద్ద ఎంక్వయిరీ చేశాకే ఇంటి రుణంపై నిర్ణయం తీసుకోవాలి.
2. సాధారణంగా ఏ తరహా లోన్ అయినా లేదా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నా సరే.. ముందుగా సిబిల్ చెక్ చేయాలి. సిబిల్ స్కోరు 750 కి పైన ఉందో లేదో చూశాకే లోన్ అప్లై చేయడం ఉత్తమం. లేదంటే.. లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొందరు సిబిల్ చెక్ చేయకుండా లోన్‌కు అప్లై చేస్తారు. సిబిల్ తక్కువ ఉండే సరికి లోన్ రాదు. దీంతో వారు ఆందోళన చెందుతారు. అలా కాకుండా ఉండాలంటే.. లోన్‌కు అప్లై చేసే ముందుగానే ఒకసారి సిబిల్ చూసుకోవడం ఉత్తమం. లేదంటే అనవసరంగా లోన్ రిజెక్ట్ అవుతుంది.
3. ఇంటి రుణం తీసుకునే ముందు బ్యాంకులు అందించే ఫీచర్ల గురిచి వాకబు చేయాలి. ముందస్తు రుణం చెల్లింపు చార్జిలు, న్యాయ పరమైన రుసుములు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటాయో తెలుసుకోవాలి. దీంతో మీరు అధిక చార్జిలు చెల్లించాల్సిన ఇబ్బంది తప్పుతుంది. కొందరు ఇవేవీ చూసుకోకుండానే హడావిడిగా రుణం తీసుకుని ఆనక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కనుక అలా చేయరాదు. పూర్తిగా వివరాలు తెలుసుకున్నాకే లోన్ కోసం ముందుకు వెళ్లాలి.
4. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీ ప్రొఫైల్ ను బట్టి ముందుగానే ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్‌ను ఇస్తుంటాయి. అంటే మీకు రుణం ఎంత వరకు వచ్చే అవకాశం ఉందో ముందుగానే ఉజ్జాయింపుగా తెలుసుకోవచ్చన్నమాట. ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. దాంతో ఇంటి రుణం ఎంత వరకు వస్తుంది, మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుంది.. అన్న వివరాలు స్పష్టమవుతాయి. కొందరు ఇలా చేయకుండా ఇంటి రుణం తీసుకుని ఆ తరువాత తాము అనుకున్న మొత్తం రాలేదని కంగారు పడుతుంటారు. అలా కాకుండా ఉండాలంటే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎంత వస్తుందో ముందే తెలుసుకోవడం ఉత్తమం.
5. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీకు అవసరమైన ఇంటి రుణం కన్నా ఎక్కువ మొత్తం ఇస్తామని చెబుతుంటాయి. కానీ మీకు ఎంత అవసరమో అంతే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని మీరు గ్రహించాలి.
6. ఇంటి రుణం తీసుకునేటప్పుడు బ్యాంకులు మీ చేత సంతకాలు చేయించుకునే పత్రాలనన్నింటినీ క్షుణ్ణంగా చదవాలి. కొందరు అలా చదవక ఆ తరువాత వచ్చే ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కనుక సమస్యలు లేకుండా ఉండాలంటే.. సంతకాలకు ముందుగానే పత్రాలను బాగా చదవాలి.
7. ఇంటి రుణం తీసుకునే ముందు ఇతర అప్పులు ఏవీ లేకుండా చూసుకోవడం ఉత్తమం. లేదంటే.. రుణం అనుకున్న మొత్తం అందకపోవడం లేదా రుణం తిరస్కరణకు గురవడం జరుగుతుంటాయి.
8. ఇంటి రుణం తీసుకునే వారు తమ పేరిట బీమా చేయించుకోవాలి. అనుకోని స్థితిలో ఆ వ్యక్తికి ఏమైనా అయితే ఇంటి నెలసరి వాయిదాలను చెల్లించడంలో ఇబ్బందులు ఎదురు కాకూడదు. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే.. రుణం తీసుకున్న వారు బీమా చేయించుకోవాలి.
9. కొందరు ఇంటి రుణాలను త్వరగా చెల్లించాలనే ఉద్దేశంతో తక్కువ గడువుతో లోన్లను తీసుకుంటారు. వాటికి నెలా నెలా అధిక మొత్తంలో ఈఎంఐలు చెలిస్తారు. ఇది బాగానే ఉన్నప్పటికీ.. అనుకోని పరిస్థితులు ఎదురై, డబ్బు సరిగా చేతికి అందకపోయినా, ఈఎంఐ మొత్తం చెల్లించలేని స్థితిలో ఉన్నా సమస్యలు ఎదురవుతాయి. కనుక వీలైనంత వరకు ఇంటి రుణం గడువును ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అయితే ఆదాయం బాగా ఉందనుకున్న వారు తక్కువ గడువుతో ఇంటి రుణం తీసుకోవడమే ఉత్తమం. దాంతో వడ్డీ తగ్గుతుంది.
10. కొన్ని బ్యాంకులు ఇంటి రుణాలపై తక్కువ వడ్డీ ఇస్తామని చెబుతుంటాయి. అది నిజమే అయినప్పటికీ.. ఇతర చార్జిల రూపంలో మన నుంచి వారు ఎక్కువ వసూలు చూస్తారు. కనుక వాటిని కూడా గమనించాలి.
11. ఇంటి రుణం తీసుకున్న మరుసటి నెల నుంచే వాయిదాలు ప్రారంభమవుతాయి. కనుక ఆ విషయం తెలుసుకుని మసలుకోవాలి. ఈఎంఐ మొత్తాన్ని 10 రోజుల ముందుగానే సర్దుబాటు చేసుకుంటే సులభంగా ఈఎంఐలు చెల్లించవచ్చు.