ఇప్పుడంటే మన దేశంలో ఉన్న యూనివర్సిటీలు ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా అంతగా గుర్తింపు పొందలేకపోతున్నాయి. అంటే… ఒకటి రెండు యూనివర్సిటీలు ఉన్నా… అవి విదేశాలకు చెందిన యూనివర్సిటీలతో పోటీ పడలేకపోతున్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం అలా కాదు. సీన్ అంతా రివర్స్‌లా ఉండేది. అంటే… పూర్వం మన దేశంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న పురాతన విశ్వ విద్యాలయాలు ప్రపంచంలోకెల్లా ఉత్తమ విశ్వ విద్యాలయాలుగా పేరుగాంచాయి. కాలక్రమేణా అవి కనుమరుగైపోయినా… వాటి గురించి మాత్రం చరిత్ర పుటల్లో ఇంకా మనకు వివరాలు దొరుకుతాయి. అలాంటి విశ్వ విద్యాలయాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. పుష్పగిరి (రత్నగిరి) యూనివర్సిటీ, ఒడిశా… ఇది 800 సంవత్సరాలకు పూర్వం ఉన్న విశ్వ విద్యాలయం. 3 నుంచి 11వ శతాబ్దం మధ్యలో ఇందులో విద్యార్థులు చదువుకున్నారు. లలిత్‌గిరి, రత్నగిరి, ఉదయగిరి కొండలపై ఈ విద్యాలయం విస్తరించి ఉండేది.
విక్రమశిల యూనివర్సిటీ, బీహార్… బుద్ధిజం గురించి తెలుసుకునేందుకు ఈ విశ్వ విద్యాలయం ఎంతగానో ఉపయోగపడేది. దీన్ని క్రీస్తుశకం 1200 సంవత్సరానికి పూర్వం ధర్మ పాల అనే రాజు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అయితే 1200వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ భక్తియార్ ఖిల్జీ అనే రాజు ఈ యూనివర్సిటీని ధ్వంసం చేశాడట. జగద్దల యూనివర్సిటీ, బంగ్లాదేశ్… ఉత్తర బంగ్లాదేశ్ ప్రాంతంలో ఈ విశ్వవిద్యాలయం ఉండేది. క్రీస్తు పూర్వం 11-12 శతాబ్దాల్లో రామ్‌పాలా అనే రాజు దీన్ని నిర్మించాడట. ఇది అప్పట్లో అక్కడ ప్రధాన విశ్వవిద్యాలయంగా ఉండేదట.
నలంద విశ్వవిద్యాలయం, బీహార్… ఈ విశ్వవిద్యాలయం గురించి చాలా మందికి తెలుసు. క్రీస్తు పూర్వం 322 నుంచి 1200 సంవత్సరాల మధ్య కాలంలో మగధ రాజులు దీన్ని పాలించారు. అప్పట్లో ఇది ప్రముఖ బుద్ధిస్ట్, వేదిక్ లెర్నింగ్ సెంటర్‌గా ఉండేది. తక్షశిల యూనివర్సిటీ, పాకిస్థాన్… ప్రస్తుతం ఆ యూనివర్సిటీ ఉన్న ప్రదేశం పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉంది. ఇది ఆ కాలంలో ఓ గొప్ప యూనివర్సిటీగా ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ విశ్వవిద్యాలయానికి వచ్చి చదువుకునేవారు. ఆచార్య చాణక్యుడు కూడా ఇదే విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడట. వలభి యూనివర్సిటీ, గుజరాత్… ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అనేక అంశాల గురించి విపులంగా తెలుసుకునేవారట. ఇక్కడ చదువు అభ్యసించేందుకు విదేశాల నుంచి కూడా విద్యార్థులు వస్తూ ఉండేవారట.