ఏ విషయంలో అయినా సరే వేగం పనికిరాదు. నిదానంగా ఆలోచించి పని చేయాలి. ఉదాహరణకు మీరు ఎక్కడికైనా 9 గంటలకు వెళ్లాలనుకుంటే 8 గంటలకే అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే ప్రశాంతంగా పనులను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అలాగే రోజూ తగినన్ని నీళ్లను తాగాలనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. నీళ్లు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. తగినంత నీళ్లను తాగకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి అనారోగ్యాలను కలగజేస్తాయి. అదేవిధంగా తగినన్ని గంటల పాటు నిద్ర కూడా ఉండాల్సిందే. నిద్ర వల్ల శరీరం పునరుత్తేజం చెందుతుంది. తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. కనుక 100 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించాలంటే కచ్చితంగా రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించాల్సిందే.
రోజూ కచ్చితంగా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగాలు రాకుండా చేస్తుంది. వ్యాయామం ఏదైనా కానివ్వండి. కచ్చితంగా రోజూ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఎల్లప్పుడూ ఇంట్లో వండిన ఆహారాలనే తినండి. బయటి ఫుడ్ తినడం చాలా ప్రమాదకరం అన్న విషయాన్ని గుర్తించండి.
పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. రోజులో మీరు తినే ఆహారంలో ఇవి సగభాగం ఉండాలి. అప్పుడే మీకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇతరులతో మిమ్మల్ని మీరు ఎప్పటికీ పోల్చుకోవద్దు. అలా పోల్చుకుంటే వారి కంటే మీరు ఎల్లప్పుడూ తక్కువే అన్న భావనలోనే ఉంటారు. ఇది నెగెటివ్ ఆలోచనలకు దారి తీస్తుంది. మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వదు. కనుక ఒకరి గురించి ఆలోచించడం మానేయండి. అలాగే మీకు సహాయం చేసిన వారిని మరిచిపోకుండా కృతజ్ఞతా భావంతో ఉండండి. పొగ తాగకండి, మద్యం సేవించకండి. ప్రతి మనిషిలోనూ కాస్త చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. దాన్ని పోనీయకండి.