Boiled Egg : కోడిగుడ్లను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అవంటే చాలా మందికి ఇష్టమే. కొందరు వాటిని ఉడకబెట్టి తింటే ఇంకొందరు ఆమ్లెట్ వేసుకుని, ఇంకా కొందరు కూరగా చేసుకుని తింటారు. అయితే ఎవరు ఎలా తిన్నా ఉడకబెట్టిన గుడ్ల విషయంలో మాత్రం మనం ఓ విషయాన్ని గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అదేమిటంటే.. ఒక కోడిగుడ్డు ఉడికేందుకు మహా అయితే ఎంత సమయం పడుతుంది..? 10 లేదా 15 నిమిషాలు. అదీ.. మనం పెట్టే మంటను బట్టి కూడా ఉంటుంది. కానీ అసలు గుడ్డును సరిగ్గా ఎన్ని నిమిషాల పాటు ఉడికించి తింటే మంచిదో తెలుసా..? ఇదే విషయంపై జె. కెంజీ లోపెజ్- ఆల్ట్ అనే ఓ అమెరికన్ చెఫ్ ప్రయోగం చేశారు. ఆయన ఏం చెబుతున్నారంటే..
కోడిగుడ్డు తెల్ల సొన ఉడికేందుకు దాదాపుగా 82 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. అదే దాని లోపల ఉన్న పచ్చ సొన ఉడికేందుకు మాత్రం అంత కన్నా తక్కువగా అంటే 76 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే అవసరం అవుతుందని చెప్పారు. ఈ క్రమంలో గుడ్డును ఉడకబెట్టే కొద్దీ ఒక్కో నిమిషానికి అందులో వచ్చే మార్పులను ఆయన రికార్డ్ చేశారు. గుడ్డును ఉడకబెట్టినప్పుడు 1 నుంచి 3 నిమిషాలలో గుడ్డు ఇంకా పచ్చిగానే ఉంటుంది. కానీ పచ్చ సొన విడిపోయి ద్రవంగా మారుతుంది. తెల్లసొన అలాగే జిగురుగా ఉంటుంది.
5 నుంచి 7 నిమిషాల్లో గుడ్డు పచ్చ సొన గట్టిగా మారుతుంది. కానీ తెల్లసొన ఇంకా ద్రవంగానే ఉంటుంది. 9 నుంచి 11 నిమిషాల్లో పచ్చ సొన బాగా ఉడుకుతుంది. తెల్లసొన గట్టిగా మారుతుంది. జిడ్డుగా ఉంటుంది. 13 నుంచి 15 నిమిషాల్లో గుడ్డు బాగా ఉడుకుతుంది. తెల్ల, పచ్చ సొనలు రెండూ హార్డ్ బాయిల్ అవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సదరు చెఫ్ ఏమంటున్నారంటే.. ఒక కోడిగుడ్డును హార్డ్ బాయిల్ చేసేందుకు కనీసం 13 నిమిషాల సమయం పడుతుందట. అదీ ఎక్కువ మంట పెడితే 9 నిమిషాల్లోనే గుడ్డు ఉడుకుతుందని అంటున్నారు. కనుక హార్డ్ బాయిల్ ఎగ్ తినాలనుకునే వారు కనీసం 13 నిమిషాల పాటు దాన్ని ఉడికిస్తే చాలట. దీంతో కోడిగుడ్డు చక్కగా ఉడుకుతుంది. బాయిల్డ్ ఎగ్స్ విషయంలో ఈ సూచనలు పాటిస్తే గుడ్లు చక్కగా ఉడకడమే కాదు.. రుచిగా కూడా ఉంటాయి.