ఓ వృద్ధ జంట విడాకుల కోసం లాయర్ దగ్గరకు వెళ్తారు. 40 సంవత్సరాలుగా తమ వైవాహిక జీవితంలో తాము ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటూ వస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ వారు విడాకులు తీసుకోలేదు. ఎందుకంటే పిల్లల కోసం వారు సర్దుకుపోయారు. కానీ ఇప్పుడు వారు పెరిగి పెద్దవారయ్యారు. సొంత కుటుంబాలు ఏర్పడ్డాయి. కనుక ఇప్పుడు విడాకులు తీసుకోవచ్చని వారు భావించారు. అందులో భాగంగానే లాయర్ వద్దకు వస్తారు. కానీ లాయర్‌కు ఏమీ అర్థం కాలేదు.40 సంవత్సరాల పాటు ఎన్ని గొడవలు వచ్చినా సర్దుకుపోయి ఉన్నారు. ఇప్పుడు పిల్లలు లేరు, ప్రశాంతంగా ఉండొచ్చు, అయినా వారు ఎందుకు విడాకులు కావాలనుకుంటున్నారో లాయర్‌కు అర్థం కాదు. ఈ క్రమంలోనే ఏం చేయాలో తెలియక లాయర్ కొంత సేపు మౌనం వహిస్తాడు. ఆ తరువాత తేరుకుని విడాకుల పేపర్లు సిద్ధం చేస్తాడు.
ఈ క్రమంలో భార్య ముందుగా విడాకుల పత్రంపై సంతకం పెడుతుంది. అప్పుడు ఆమె… నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది, కానీ ఇప్పుడు ఏమీ చేయలేం. ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదు, నేను ఇక భరించలేను, నన్ను క్షమించండి… అని భర్తతో అంటుంది. అప్పుడు భర్త… సరే… నేనర్థం చేసుకున్నాలే… అంటాడు. ఇక సంతకాలు అయ్యాక ఆ లాయర్ దంపతులిద్దరితో కలిసి డిన్నర్ చేద్దాం అంటాడు. అందుకు వారు ఒప్పుకుంటారు. ముగ్గురూ కలిసి డిన్నర్ చేసేందుకు వెళ్తారు. హోటల్‌లో డిన్నర్ చేస్తుంటారు. ముందుగా రోస్టెడ్ చికెన్ తెప్పించుకుంటారు. తరువాత ఎవరికి కావల్సినవి వారు ఆర్డర్ ఇచ్చుకుంటారు. ఈ క్రమంలో టేబుల్‌పై పెట్టిన మునగకాడల కూరలోంచి ఓ ముక్క తీసి ఆ భర్త తన భార్యకు తినిపించబోడతాడు.
అప్పుడు అతని భార్య… నువ్వెప్పుడూ ఇంతే. అందరిపై అధికారం చెలాయిస్తావు. ఇతరులకు చాన్స్ ఇవ్వవు. ఇతరులకు ఆలోచించుకునే టైం ఇవ్వవు, ఇతరులను అర్థం చేసుకోవు, నాకు మునగకాడలు అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా..? అంటుంది. దీంతో ఆ భర్త ఆ పని విరమించుకుంటాడు. ఎలాగో డిన్నర్ ముగించి ఎవరి ఇండ్లకు వారు చేరుకుంటారు. భర్త, భార్య వేరే వేరే ఇండ్లకు వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టదు. ఆ సమయంలో భర్త… నేను అలా చేసి ఉండాల్సింది కాదు, వెంటనే క్షమాపణలు కోరతా, ఆమె అంటే నాకు చాలా ప్రేమ ఉంది, అందుకని ఐ లవ్ యూ అని కూడా చెబుతా.. అని అనుకుంటాడు. వెంటనే ఫోన్ చేస్తాడు. కానీ అతని భార్య స్పందించదు. అతను అలా చాలా సార్లు కాల్ చేస్తాడు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇన్నేళ్లు ఎలా గడిచిపోయాయో తెలియదు, నన్నైతే ఆయన ఎప్పుడూ అర్థం చేసుకోలేదు అని ఆమె అనుకుంటూ నిద్రిస్తుంది. అతను అంటే ఆమెకు ప్రేమ ఉంది. కానీ ఇక అతన్ని భరించే ఓపిక మాత్రం లేదు. అతనికి గుండె సమస్య ఉన్నట్టు ఆమెకు తెలుసు.
తెల్లారగానే ఆమెకో ఫోన్ కాల్ వస్తుంది. భర్త గుండె పోటుతో చనిపోయాడని అవతలి వ్యక్తి చెబుతాడు. దీంతో ఆమె హతాశురాలవుతుంది. ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. తరువాతే ఆమెకు తెలుస్తుంది, చాలా సార్లు ఫోన్ కాల్ చేసి ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో మనస్థాపం చెంది అతనికి గుండె పోటు వచ్చిందని, అందుకే అతను చనిపోయాడని ఆమెకు తెలుస్తుంది. ఇంతలో భర్త చివరిసారిగా రాసిన ఓ లెటర్‌ను ఎవరో తెచ్చి ఆమెకు ఇస్తారు. దాన్ని ఆమె చదువుతుంది… నా ప్రియమైన భార్యకు, నువ్వు దీన్ని చదివేటప్పటికి నేను ఈ లోకంలో ఉండను. నేను నీ కోసం ఓ పాలసీ తీసుకున్నా. దాని విలువ కేవలం రూ.6.50 లక్షలు. అయినప్పటికీ నేను నీకు లేని లోటును ఆ డబ్బు తీరుస్తుందని భావిస్తున్నా. ఇది ఎందుకంటే, పెళ్లి చేసుకున్నప్పుడే నేను నీకు ప్రమాణం చేశా కదా, ఎళ్లవేళలా నిన్ను రక్షిస్తానని, నీకు సహాయంగా ఉంటానని, అందుకే ఆ పాలసీ తీసుకున్నా. అది నీకు సహాయం అవుతుందని భావిస్తున్నా. నేను నిన్ను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నా..!
భర్త సరిగ్గా ప్రేమించడం లేదని భార్య అనుకున్నా భర్త మనస్సులో చాలా ప్రేమే ఉంటుంది. కానీ అతను దాన్ని తెలపడు. మనస్సులోనే దాచుకుంటాడు. విడాకుల వరకు వస్తే గానీ అతనికి విషయం బోధపడలేదు. ఆపైన ప్రేమ తెలుపుదామనుకున్నా అతను మిగలలేదు. ఒక వేళ ఆ ప్రేమను ముందే తెలియజేసి ఉంటే వారి జీవితం విడాకుల వరకు వచ్చేది కాదు, ఆపై అంతటి విషాదం జరిగి ఉండేది కాదు. కనుక ఎవరైనా ప్రేమిస్తే ఆ ప్రేమను వెంటనే తెలియజేయండి. ఎందుకంటే ఆ తరువాత నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.