కోర్టుల్లో ప్రొసిడింగ్స్ ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందే. పోలీసులు నిందితులను ప్రవేశపెడతారు. న్యాయవాదులు వాదిస్తారు. అనంతరం సాక్ష్యాలను బట్టి నేరం రుజువైతే న్యాయమూర్తి శిక్ష వేస్తారు. లేదంటే నిర్దోషి అయితే వ్యక్తి బయటకు వస్తాడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే కోర్టులో జడ్జి కొన్ని సందర్భాల్లో తన సుత్తితో ఆర్డర్.. ఆర్డర్.. అంటారు కదా. అవును, అంటారు. ఇంతకీ అసలు సుత్తిని జడ్జిలు అలా బల్లకు ఎందుకు కొడతారు, ఏయే సందర్భాల్లో కొడతారు, అసలు అలా సుత్తి బల్లకు కొట్టడం ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
జడ్జిలు కోర్టులో వాడే సుత్తిని ఇంగ్లిష్‌లో Gavel అంటారు. ఈ పదం gafol అనే పురాతన ఇంగ్లిష్ పదం నుంచి పుట్టింది. gafol అంటే tribute అని అర్థం వస్తుంది. అయితే కోర్టుల్లో జడ్జిలు ఈ సుత్తిని ఎప్పటి నుంచి వాడుతున్నారో సరిగ్గా తెలియదు కానీ, ఈ వాడకం మాత్రం ఇంగ్లండ్‌లో మొదటి సారిగా జరిగిందని చరిత్ర చెబుతోంది. ఇంగ్లండ్‌లో కోర్టు రూమ్‌లలో అప్పట్లో బాగా న్యూసెన్స్ జరిగేదట. జనాలు, లాయర్లు, పోలీసులు.. ఇలా చాలా మందితో కోర్టు రూములు నిండే సరికి గోల గోలగా ఉండేవట. దీంతో వారిని నిశ్శబ్దంగా ఉండమని అరిచి చెప్పినా ఎవరూ వినేవారు కాదట. దీంతో కొందరు ఏం చేశారంటే చెక్క, కొన్ని లోహపు పదార్థాలను కలిపి సుత్తి తయారు చేశారు. దాంతో బల్లపై కొడితే చాలా పెద్ద శబ్దం వచ్చేది. దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆ శబ్దంపై పడి వారు అందరూ నిశ్శబ్దం అయ్యేవారు. ఆ క్రమంలో జడ్జి సైలెన్స్ అనే సరికి ఇక అంతా సైలెన్స్ అయిపోవడం ప్రారంభించారు. అలా మొదటిగా ఇంగ్లండ్‌లో ఇలా కోర్టుల్లో సుత్తి వాడకం ప్రారంభమైందట.
అనంతరం అనేక దేశాల్లో ఇదే పద్ధతి అమలులోకి వచ్చింది. అయితే నిజానికి ఇంగ్లండ్‌లో ప్రారంభమైన సుత్తి వాడకం, ఇప్పుడు మాత్రం అక్కడ లేదట. సుత్తిలను ఇప్పుడు అక్కడి కోర్టు రూముల్లో జడ్జిలు వాడడం లేదట. కానీ ఇతర దేశాల్లో చాలా వరకు ఇప్పటికీ కోర్టుల్లో జడ్జిలు సుత్తిలను వాడుతూనే ఉన్నారు. అయితే న్యాయమూర్తి సుత్తిని కేవలం కోర్టు రూంలో సైలెన్స్ తేవడం కోసం మాత్రమే కాదు, తీర్పులు చెప్పేటప్పుడు, న్యాయవాదులు వాదించేటప్పుడు కూడా బల్లపై సుత్తిని మోదుతారట. ఇదీ.. జడ్జిగారి సుత్తి వెనుక ఉన్న కథ..! అయితే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సుత్తిలను వేలం పాటలో కూడా వాడుతారు. వేలం ముగిసిందని చెప్పడానికి వీటిని మోది విషయాన్ని తెలియపరుస్తారు.