బ్రిటన్‌లోని ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరైన ఓ యువతి అక్కడి మానవ వనరుల అధికారి అడిగిన ప్రశ్నలకు అవాక్కైంది. ఈ కాలంలో కూడా మహిళా ఉద్యోగులకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయా అంటూ ఆమె పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు ఆమె పరిస్థితికి సంఘీభావం తెలిపితే కొందరు మాత్రం కంపెనీకి మద్దతుగా నిలిచారు. ఉద్యోగంలోకి తీసుకునే ముందు అభ్యర్థుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి అని కామెంట్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, బ్రిటన్‌లో ఉంటున్న జాహ్నవీ జైన్ (25) ఓ పోస్టు పెట్టింది. బ్రిటన్‌లోని ఓ భారతీయ కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లినట్టు చెప్పింది. అయితే, తను పెళ్లి ఎప్పుడు చేసుకోదలిచిందో చెప్పాలని ఇంటర్వ్యూ సందర్భంగా హెచ్ ఆర్ అధికారి అడిగారని వివరించింది. ‘మీరు త్వరలో పెళ్లి చేసుకుంటారా? అని హెచ్ఆర్ అడిగారు. ఇలాంటి ప్రశ్నలు ఇంకా అడుగుతున్నారా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఈ పోస్టు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. నేటి జమానాలో పని సంస్కృతిపై చర్చకు దారి తీసింది. తమకూ ఇంటర్వ్యూల్లో ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయని పలువురు మహిళలు వాపోయారు. పురుష అభ్యర్థులను ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగరని పేర్కొన్నారు. ‘ఇప్పటికీ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. పెళ్లి వల్ల మన దృష్టి మళ్లుతుందని వారు అనుకుంటారు’ అని ఓ మహిళ కామెంట్ చేశారు. ఇలాంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఏంటని మరో వ్యక్తి ప్రశ్నించారు.
ఈ ప్రశ్న వెనకాల ఎలాంటి దురుద్దేశం ఉండదని ఓ మహిళ తన స్వానుభవాన్ని పంచుకున్నారు. నాకు 26 ఏళ్లప్పుడు ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదుర్కొన్నా. ఆ తరువాత జాబ్ వచ్చింది. పెళ్లి సమయంలో 20 రోజుల లీవ్ కూడా ఇచ్చారు. తమ ప్రాజెక్టులకు సంబంధించి ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు కంపెనీలు ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటాయి అని ఆ మహిళ అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది.