మనుషులందరి స్వభావం ఒకే విధంగా ఉండదు. కొందరు ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే మరికొందరు ఏదో పోగొట్టుకున్నట్టు ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. ఇంకా కొందరు అటూ ఇటూ కాకుండా ఒకసారి నవ్వుతూ, మరోసారి సీరియస్ లుక్‌తో ఉంటారు. అయితే ఎవరెలా ఉన్నా ఏం బాధ లేదు. కానీ కొన్ని విలక్షమైన వ్యక్తిత్వాలు, మనస్తత్వం కలిగిన వ్యక్తులతో ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలట. అవసరమైతే వారి నుంచి వీలైనంత దూరంగా వెళ్లాలట. లేదంటే వారి వల్ల మనకు ఎప్పటికీ కష్టాలే వస్తాయట. అంతేకాదు మన జీవితంలో ఉన్న సంతోషం కూడా పోతుందట. ఇంతకీ అలాంటి వ్యక్తులు ఎవరనేగా మీ డౌట్, వారి గురించి తెలుసుకుందాం పదండి.
ఇతరుల కష్టాలను చూసి ఆనందించేవారు… ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తుల నుంచి వీలైనంత దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే ఇలాంటి వారు ఇతరులు బాధపడుతుంటే లోలోపల ఆనందిస్తారు. కొన్ని సార్లు పైకే హ్యాపీగా కనబడతారు. వీరిలోనే ఇంకో టైప్ ఎలా ఉంటారంటే ఇతరులకు ఎప్పటికీ కష్టాలు, నష్టాలు కలిగిస్తూ వాటితో ఇతరులు బాధపడుతుంటే తాము ఆనందిస్తారు. కాబట్టి ఇలాంటి వారి నుంచి వీలైనంత వరకు దూరంగానే ఉండాలి. ఈగో ఎక్కువ ఉన్నవారు… ఇలాంటి వారు మనకు ఎలాంటి హాని కలిగించకున్నా వారి వల్ల మనకు ఒక్కోసారి నష్టం కలిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. వీరు మన ప్రగతిని, ఉన్నతిని చూసి ఓర్వలేరు. ఆ క్రమంలో మనకు ఏదైనా నష్టం తలపెట్టవచ్చు. ఇలాంటి వారు ఎక్కువగా తాము చేసే తప్పులను అంత సులభంగా అంగీకరించరు. వీరి నుంచి కూడా దూరంగానే ఉండాలి.
మోసం చేసే వారు… మోసం చేసే వారు ఎల్లప్పుడూ తమ స్వార్థం కోసమే పనిచేస్తారు. దాన్నే చూసుకుంటారు. అంతే తప్ప వారు ఇతరులతో ఎప్పటికీ కలిసి ఉండలేరు. ఈ క్రమంలో అలాంటి వారు కొన్ని సందర్భాల్లో మనకు హాని కలిగిస్తారు. కాబట్టి ఇలాంటి వారి నుంచి కూడా దూరంగానే ఉండాలి. నమ్మి మోసపోకూడదు. స్త్రీ లోలురు… ఎల్లప్పుడూ స్త్రీల వెంట తిరిగే వారు, స్త్రీ లోలుర నుంచి కూడా దూరంగానే ఉండాలి. వారితో ఎప్పటికైనా ప్రమాదమే. అలాంటి వారికి మహిళలు తన, పరాయి అనే భేదం ఉండదు. దీంతో వారు హాని కూడా కలిగించవచ్చు. అత్యాశ, స్వార్థ పరులు… అతిగా ఆశ పడే వారు, స్వార్థ పరుల నుంచి దూరంగా ఉండాలి. వారు మనకు ఎప్పటికైనా నష్టం కలిగిస్తారు. ఇలాంటి వారు ఇతరుల నమ్మకాలను, పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా తగ్గిస్తారు. ఇతరులు సంతోష పడితే వీరు చూడలేరు.
ఇతరులను చూసి అసూయ పడేవారు… ఇతరులను చూసి ఎక్కువగా ఈర్ష్య, అసూయలకు లోనయ్యవారి నుంచి కూడా మనం దూరంగానే ఉండాలి. వారితోనూ ఎప్పటికీ ప్రమాదాలే పొంచి ఉంటాయి. వారు ఒకరి ఉన్నతిని చూసి ఓర్వలేరు.