ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్‌కు వెళితే పరీక్షలు చేశాక డాక్టర్లు మనకు మందులను రాస్తుంటారు. అయితే డాక్టర్లు రాసే చిట్టీలో మందుల వివరాలను చూస్తే మనకు అస్సలు అర్థం కావు. వారు రాసే అక్షరాలను అస్సలు అర్థం చేసుకోలేం. అయితే డాక్టర్లు ఇలా మనకు అర్థం కాకుండా మందులను ఎందుకు ప్రిస్క్రిప్షన్‌లో రాస్తారో తెలుసా ? ఆ వివరాలనే ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో సాధారణంగా వైద్యులు ఒక్కోసారి రోజుకు 100కు పైగా పేషెంట్లను చూడాల్సి వస్తుంది. అమెరికా వంటి దేశాల్లో అయితే ఒక రోజుకు డాక్టర్లు 20-30 మంది వరకే చూస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. వైద్యుల సంఖ్య తక్కువ. పేషెంట్లు ఎక్కువ. కనుక ఒక్కో డాక్టర్ చాలా మంది పేషెంట్లను చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఒక్కో పేషెంట్‌కు చెందిన వివరాలను తెలుసుకుంటూ చిట్టీపై వారి వివరాలతోపాటు మందులను రాయాలంటే చేతులు ఇబ్బంది పెడతాయి. కనుక వారు వేగంగా రాస్తారు. అలా రాసే క్రమంలో వారి రాత అర్థం కాకుండా పోతుంది.
ఇక పేషెంట్లకు చెందిన వివరాలను చక్కగా అర్థం వచ్చేలా రాయాలంటే అందుకు సమయం పడుతుంది. కానీ మిగిలిన పేషెంట్లను చూసేందుకు సమయం ఉండదు. కనుక డాక్టర్లు ఆ విధంగా రాయాల్సి వస్తుంది. ఇది కూడా అందుకు ఒక కారణమే.
ఇక మెడిసిన్ చదివే వారు సహజంగానే ఎక్కువగా రాయాల్సి ఉంటుంది. ఇతర కోర్సుల్లో చదివే వారి కన్నా మెడిసిన్ చదివే వారు ఎక్కువగా రాస్తారు. కనుక వారి రాత రాను రాను మారుతుంది. వారు వేగంగా రాయడం అలవాటు చేసుకుంటారు. దీంతో ఆ రాత అర్థం కాకుండా పోతుంది. మనం పరీక్ష హాల్‌లో ముందుగా చక్కగానే రాస్తాం. కానీ చివరకు వచ్చే సరికి చేతులు నొప్పి వస్తాయి. దీంతో చివర్లో మనం సమాధానాలను వేగంగా రాస్తాం. అప్పుడు మన రాత కూడా మారుతుంది. సరిగ్గా ఉండదు. డాక్టర్ల విషయంలోనూ అలాగే జరుగుతుంది. అందుకనే వారి రాత అర్థం కాకుండా ఉంటుంది.
అయితే ప్రస్తుతం చాలా మంది డాక్టర్లు కంప్యూటర్ల సహాయంతో డిజిటల్ ప్రిస్క్రిప్షన్ లను ఇస్తున్నారు. అందువల్ల ఇప్పుడు చాలా వరకు డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లు మనకు అర్థం అవుతున్నాయి. వారి రాత బాగా లేనందుకు మనం జోకులు కూడా వేసుకుంటాం. కానీ వారు పడే బాధ మనకు తెలియదు. కనుక వారి రాతపై హేళన చేయాల్సిన అవసరం లేదు.