ఆఫీసుల్లో పనిచేసే వారికి నిత్యం వివిధ సందర్భాల్లో ఆందోళన, ఒత్తిడి ఎదురవడం మామూలే. ఆ మాట కొస్తే అసలు ఏ పని చేసినా ఆ మాత్రం ఒత్తిడి, ఆందోళన ఉంటాయి. వాటిని తగ్గించుకునేందుకు చాలా మంది ఎంటర్‌టైన్‌మెంట్ దిశగా పరుగులు తీస్తారు. కొందరు సినిమాలు చూస్తే, కొందరు మంచి భోజనం చేస్తారు. ఇంకొందరు టూర్ వేస్తారు, మరికొందరు గేమ్స్ ఆడతారు. అనేక మంది రక రకాలుగా తమకు కలిగే ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఆయా మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే అన్నింటికన్నా చాలా సులభమైన, వేగమైన పద్ధతి ఏంటో తెలుసా..? దాంతో ఒత్తిడి ఇట్టే మాయమై హుషారు వస్తుందట..! ఇంతకీ ఆ ట్రిక్ ఏమిటంటే…
ఏమీ లేదండీ… పని నుంచి బయటికి వచ్చి మీ చుట్టూ ఉన్న పరిసరాలను ఓసారి గమనించండి. అందులో ఏం కనిపిస్తాయి..? సిటీలో అయితే చుట్టూ ఉన్న భవంతులు, అరకొరగా ఉండే చెట్లు కనిపిస్తాయి. అదే శివారు ప్రాంతాలైతే చెట్లు బాగానే కనిపిస్తాయి. కానీ మీరు చూడాల్సింది వాటిని కాదు, వాటి మీద వాలే పక్షులను. అవును, వాటినే. మీకు దొరికినంత ఖాళీ సమయంలో వీలున్నన్ని పక్షులను చూడండి. ఎన్ని వీలైతే అన్ని పక్షులను, అదీ, ఇదీ అని తేడా లేకుండా, కనబడ్డ పక్షిని కనబడినట్టు చూడండి. అది ఎగిరే విధానాన్ని, వాలే విధానాన్ని, అది చేసే చేష్టలను అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించండి. అంతే, మీ ఒత్తిడి మటుమాయం అవుతుంది. ఆందోళన తగ్గుతుంది. మళ్లీ మీరు హుషారుగా పనిచేయకపోతే అప్పుడు చెప్పండి..!
ఇంతకీ ఈ పక్షులను చూడడం అనే ఐడియా మీదేనా..? అని మమ్మల్ని అడగబోతున్నారా..? అయితే ఆగండి.. ఎందుకంటే ఇది మేం చెబుతోంది కాదు. యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ పరిశోధకులు చెబుతున్న మాటలు. అక్కడి ఆర్నిథాలజీ విభాగం సైంటిస్టులు ఈ విషయంపై ఏకంగా ప్రయోగం కూడా చేశారు. ఆ తరువాతే ఈ విషయాన్ని వెల్లడించారు. కనుక, మీకెప్పుడైనా ఆందోళన, ఒత్తిడి అనిపిస్తే వెంటనే బయటికి వెళ్లి ఆరుబయట ఎగిరే పక్షులను చూడండి. వాటిని ఎంత సేపు చూస్తే మీ ఒత్తిడి అంత పటాపంచలు అవుతుంది..!