Tablets : ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి డాక్టర్ వద్దకు వెళితే వారు మందులను రాస్తారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అయితే మందులను ఎల్లప్పుడూ వాడుతూనే ఉంటారు. మందుల్లో అనేక రకాలు ఉంటాయి. ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌తోపాటు టానిక్‌లు కూడా ఉంటాయి. అయితే ట్యాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ వేసుకునేటప్పుడు కచ్చితంగా నీటిని తాగాల్సి ఉంటుంది.
ట్యాబ్లెట్లను వేసుకునేటప్పుడు నీటిని తాగకపోతే ఆ ట్యాబ్లెట్లు నోట్లో లేదా గొంతులో.. ఎక్కడైనా అతుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. నీళ్లను అసలు తాగకపోయినా.. తగినంత నీటిని తాగకపోయినా.. మనం వేసుకునే ట్యాబ్లెట్లు జీర్ణాశయంలో సరిగ్గా కరగవు. దీంతో ఆ ట్యాబ్లెట్ ద్వారా మనకు పూర్తి స్థాయిలో ఫలితం లభించదు. అందుకనే ట్యాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ ను వేసుకునేటప్పుడు కచ్చితంగా నీటిని తాగాలని డాక్టర్లు చెబుతుంటారు.
అయితే ట్యాబ్లెట్లను వేసుకునేటప్పుడు నీటిని ఎంత మోతాదులో తాగాలి ? అనే విషయం చాలా మందికి తెలియదు. కొందరు చాలా తక్కువ మొత్తంలో నీటిని తాగుతుంటారు. ఇలా తాగినా పెద్దగా ఫలితం ఉండదు. ట్యాబ్లెట్లు పూర్తిగా కరిగి వాటి ద్వారా ఎక్కువ మొత్తంలో ఫలితం పొందాలంటే.. ట్యాబ్లెట్లను వేసుకున్నాక.. ఒక గ్లాస్ నీటిని పూర్తిగా తాగేయాలి.
ఇక ట్యాబ్లెట్లు ఎన్ని ఉన్నా సరే ఒక గ్లాస్ నీటిని పూర్తిగా తాగితే చాలు. అలాగే మరీ చల్లగా.. మరీ వేడిగా ఉండే నీళ్లను తాగరాదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లనే తాగాలి. దీంతో ట్యాబ్లెట్ సులభంగా కరిగిపోతుంది. ఈ విధంగా ట్యాబ్లెట్లను లేదా క్యాప్సూల్స్‌ను వేసుకోవాల్సి ఉంటుంది. నీటిని మాత్రం ఒక గ్లాస్ పూర్తిగా తాగాల్సి ఉంటుంది.