ఎవరైనా గంటల తరబడి నిద్రపోయినా, గాఢనిద్రలో నుంచి తేరుకోకపోయినా.. వీడేంట్రా కుంభకర్ణునిలా నిద్రపోతున్నాడు అంటూ ఉంటాం. ఇక కుంభాలు కుంభాలు పరిమితికి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్నా వాళ్లను కుంభకర్ణుడితో సరదాగా పోలుస్తాము. మరి నిజంగానే కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోయేవాడా..? అసలు ఇలా అనడానికి గల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..? ఇప్పుడు కుంభకర్ణుడు ఆరు నెలలపాటు ఎందుకు నిద్రపోయేవాడు.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు నిజానికి కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి మేల్కొంటాడు అనే విషయం మాత్రమే తెలుసు. రావణాసురుడు సోదరుడైన కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి మేల్కొని ఆరోజు మొత్తం ఆహారాన్ని తీసుకొని మరలా తిరిగి నిద్రపోతాడు. కానీ కుంభకర్ణుడు ఎందుకు ఈ విధంగా నిద్రపోతాడు అనే విషయం ఎవరికీ తెలియదు. ఈ విషయం గురించి రామాయణంలోని ఉత్తరకాండలో చెప్పడం జరిగింది.
దైవ అనుగ్రహం కోసం రావణుడితో కలిసి ఆయన ఇద్దరు సోదరులైనా విభీషణుడు మరియు కుంభకర్ణుడు అనేక సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తారు. వీరి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అని ముగ్గురు సోదరులని అడగడం జరుగుతుంది. ముందుగా రావణాసురుని వరం కోరుకోమని బ్రహ్మ అడగ్గా.. దానికి గాను రావణాసుడు తనకి అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. కానీ బ్రహ్మ రావణాసుని కోరుకుని తిరస్కరించి దానికి బదులుగా పక్షులు, పాములు, యక్షులు, రాక్షసులు చేత మరణం ఉండదని వరం ప్రసాదిస్తారు.
రావణాసుని మొదటి సోదరుడైన విభీషణుడు నీతిని పాటించే మార్గంలో నడుచుకునే విధంగా వరం ఇమ్మని కోరుకుంటాడు. విభీషణు కోరుకున్న విధంగానే బ్రహ్మదేవుడు వరం ప్రసాదిస్తారు. కుంభకర్ణుని దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మని దేవతలు అడ్డగిస్తారు. ఎందుకంటే రావణ సోదరులలో కుంభకర్ణుడు చాలా శక్తివంతుడు. తృప్తి పరచని ఆకలితో ఇతడు ప్రపంచాన్నే నాశనం చేస్తాడని బ్రహ్మదేవుడికి సలహాఇస్తారు దేవతలు.
ఈ విషయం దృష్టిలో పెట్టుకుని కుంభకర్ణుని వరం అడగకుండా చేయాలని బ్రహ్మదేవుడు నిశ్చయించుకుంటారు. ఈ విషయంపై జ్ఞానం, తెలివితేటలకు మూలమైన ఆయన భార్య సరస్వతిని సహాయం చేయమని కోరుతాడు బ్రహ్మ. కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు అతని నాలుకను నియంత్రణలో ఉంచాలని సరస్వతి మాతకు వెల్లడిస్తారు బ్రహ్మ. కుంభకర్ణుడు ఇంద్రుని ఆసనాన్ని (ఇంద్రుని సింహాసనాన్ని) కోరుకోవాలని ఉద్దేశంతో ఇంద్రాసనం అనడానికి బదులు పొరపాటున నిద్రాసనం వరంగా ఇవ్వండి అని కోరుకుంటాడు. ఇప్పుడైతే నిద్రాసనం అనే పదం కుంభకర్ణుడు నాలుక నుంచి వస్తుందో వెంటనే బ్రహ్మదేవుడు తధాస్తు అని వరం ఇచ్చేస్తాడు.
వెంటనే ఈ విషయంపై రావణుడు కలగజేసుకొని నిరంతరం కుంభకర్ణుడు నిద్రలో ఉండడం సరికాదు. ఆ నిద్రకు ఒక నిర్ణీత సమయం ఉండాలి. తర్వాత మేల్కొనేలా వరాన్ని సడలించమని బ్రహ్మ దేవుని కోరుకుంటాడు రావణాసురుడు. దానికిగానూ బ్రహ్మ అతడు ఆరు మాసాలు నిద్రలో ఉండి ఒక రోజు మేల్కొంటాడు. ఆరోజు మాత్రం భూమి మీద సంచరించే మానవులను ఆహారంగా తీసుకుంటాడు అని బ్రహ్మ వరము ఇస్తారు. రామ రావణ యుద్ధ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోయిన తొమ్మిది రోజుల వ్యవధిలోనే తిరిగి కుంభకర్ణుని మేల్కొల్పినట్లు రామాయణ యుద్ధకాండలో వెల్లడించారు.
కుంభకర్ణుడు కేవలం మోక్షం పొందడం కోసమే రామునితో యుద్ధానికి తలబడినట్లు తులసీదాస్ రచించిన రామ్ చరిత్ మానస్ లో తెలియజేయబడింది. రాముడు మహావిష్ణు అవతారం అని కుంభకర్ణునికి ముందే తెలుసు. అందుకే సీతను అపహరించిన సమయంలో కుంభకర్ణుడు రావణాసుని వ్యతిరేకిస్తాడు. కానీ పెద్దవాడైన అన్న మాటను శిరసా వహించి రామునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు కుంభకర్ణుడు. ఇక ఆ తర్వాత రామునితో యుద్ధం చేసి చివరికి మరణిస్తాడు కుంభకర్ణుడు.