Aratikaya Bajji : కూర అరటికాయలను సహజంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటితో కూర, పులుసు లేదా ఫ్రై చేస్తుంటారు. ఎలా చేసినా సరే కూర అరటి కాయలు రుచిగానే ఉంటాయి. అయితే వీటితో బజ్జీలను తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటికాయ బజ్జీల తయారీకి కావల్సిన పదార్థాలు..
కూర అరటికాయలు – రెండు, శనగపిండి – కప్పు, బియ్యం పిండి – రెండు కప్పులు, కారం పొడి – ఒక టీస్పూన్, ఇంగువ – చిటికెడు, వాము – కొద్దిగా, నూనె, ఉప్పు – తగినంత.
అరటికాయ బజ్జీలను తయారు చేసే విధానం..
అరటికాయ కొనల్ని కత్తిరించి చెక్కు తీసి పొడవాటి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని నీళ్లలో వేసి కాసేపు నానబెట్టాలి. ఒక గిన్నెలో శనగ పిండి, బియ్యం పిండి, కారం పొడి, పసుపు, వాము, ఇంగువ, తగినంత నీళ్లను పోసి ఓ మోస్తరు జారుగా కలుపుకోవాలి. అరటి ముక్కల్ని నీటి నుంచి ఒక ఎండు గుడ్డతో పొడిగా తుడవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాగాక ఒక్కో అరటి ముక్కను శనగ పిండి మిశ్రమంలో అద్ది నూనెలో వేయిస్తే అరటికాయ బజ్జీలు సిద్ధమవుతాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు. లేదా పల్లి చట్నీతో కలిపి తినవచ్చు.