Dry Fruits Milk Shake : బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా.. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ జాబితాకు చెందుతాయి. వీటిని తినడం వల్ల మనకు శక్తి లభించడంతోపాటు అనేక పోషకాలు కూడా అందుతాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే వీటితో మిల్క్ షేక్‌ను తయారు చేసుకుని చల్ల చల్లగా తాగవచ్చు. దీంతో శక్తి, పోషకాలు లభించడంతోపాటు ఈ వేసవిలో శరీరం చల్లగా కూడా ఉంటుంది. వేడి మొత్తం తగ్గుతుంది. డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఇక డ్రై ఫ్రూట్స్‌తో మిల్క్ షేక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా – ఒక్కొక్కటి పావు కప్పు చొప్పున, ఖర్జూరాలు – 8, అంజీర్ – 4, కుంకుమ పువ్వు – చిటికెడు, సోయా పాలు – రెండున్నర కప్పులు (చల్లవి), బాదం, జీడిపప్పు, పిస్తా ముక్కలు – ఒక టీస్పూన్, చక్కెర – సరిపడా.
డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ను తయారు చేసే విధానం..
ముందుగా అంజీర్‌ను వేడి నీళ్లలో అర గంట పాటు నానబెట్టాలి. బాదం, జీడిపప్పులను కాసేపు నీళ్లలో నానబెట్టాలి. అంజీర్, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, మిగతా పప్పులన్నింటినీ వేసి గ్రైండ్ చేయాలి. దీనికి పావు కప్పు సోయా పాలు, కుంకుమ పువ్వు కలిపి ఇంకోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిగతా రెండు కప్పుల పాలు, చక్కెరను కూడా కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి. దీన్ని పొడవాటి గాజు గ్లాస్‌లో పోసి పైన బాదం, జీడిపప్పు, పిస్తా ముక్కల్ని వేసి అందంగా తీర్చిదిద్దితే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అవుతుంది. దీన్ని అలాగే తాగవచ్చు. లేదా ఫ్రిజ్‌లో 2 గంటల పాటు ఉంచిన తరువాత తాగవచ్చు. దీన్ని తాగడం వల్ల శరీరంలోని వేడి మొత్తం తగ్గడంతోపాటు పోషకాలు, శక్తి లభిస్తాయి.