సహజసిద్దంగా నూతనంగా గృహ నిర్మాణాన్ని చేపట్టినప్పుడు గృహ ప్రవేశ సందర్భంలో కూడా ఒక మంచి గుమ్మడికాయ మధ్యలో రంధ్రం చేసి దానిలో ఎర్రటి నీళ్లను పోసి దానిపైన కర్పూరాన్ని ఉంచి ఆ గుమ్మడికాయను సింహ ద్వారానికి చూపిస్తూ మూడుసార్లు మంత్రాన్ని జపిస్తూ ఆ గృహంలో ప్రవేశించే దంపతులు దాన్ని నేలకు కొట్టి ప్రవేశాన్ని చేస్తారు. అలా చేసినట్లైతే ఆ గృహంలో ఉన్న దిష్టి దోషం అనేది తొలగిపోతుంది. ఇక్కడ మనం ఇచ్చే ఈ బూడిద గుమ్మడికాయ కూష్మాండ స్వరూపం కనుక దానిని విశ్వవ్యాప్తమైన శ్రీమన్నారాయణ మూర్తికి దానం చేసినటువంటి ఫలితం కూడా మనకు వస్తుంది.
అలాగే సంక్రాంతి పర్వదినాన పితృ దేవతలను తలచుకుంటూ బూడిద గుమ్మడికాయను దానం చేస్తే విశ్వాన్ని దానం చేసినంత అఖండ పుణ్య సత్ఫలితం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. అంత గొప్ప విశేషం ఈ బూడిద గుమ్మడికాయలో దాగి ఉంది. కనుక ఈ బూడిద గుమ్మడికాయ అనేది సామాన్యమైనది కాదు. ఈ బూడిద గుమ్మడికాయను మరొకటి తెచ్చి మనం గృహప్రవేశం చేసిన దగ్గర సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము. సత్యనారాయణ వ్రతం అనేది నారాయణ స్వరూపం. ఆ యొక్క వ్రతాన్ని ఆచరించిన తరువాత ఈ బూడిద గుమ్మడికాయకు కూడా పసుపు కుంకుమ చక్కగా రాసి దానికి కుంకుమ బొట్లను పెట్టి ఇంటి ముంగిట పైభాగాన ఉట్టిని కట్టి ఆ ఉట్టిలో ఆ ఇంటి యజమాని మాత్రమే ఆ బూడిద గుమ్మడికాయను ఉంచాలి.
ఇలా ఎందుకు ఉంచుతారంటే నరఘోష నరదిష్టి కొరకు. ఎందుకంటే నరుని యొక్క దిష్టికి నలు రాళ్ళు కూడా పగులుతాయి కనుక నరఘోష నరదిష్టి ఆ ఇంటిపై పడకుండా దుష్టక్తుల యొక్క ప్రభావం ఆ ఇంటిలోకి ప్రవేశించకుండా ఆ బూడిద గుమ్మడికాయను ఆ విధంగా కట్టి ఉంచే సంప్రదాయం మన హిందూ సాంప్రదాయంగా ప్రతీ కుటుంబం తప్పనిసరిగా ఆచరించవలసినదిగా శాస్త్రాలు చూపిస్తూ ఉన్నాయి. అందుచేతనే ఈ బూడిద గుమ్మడికాయకు అంత గొప్ప విశేష ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. అలాగే బూడిద గుమ్మడికాయను ఒడియాలుగా పలు రకాల ఆహార పదార్థాలలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దాని వలన ఇతరులు మన డబ్బును సంపదను అభివృద్దిని చూసి ఏమి సంపాదించారు ఏమి బ్రతుకుతున్నారు అని అనుకుంటూ ఉంటారు.
కనుక అటువంటి నరదిష్టి కూడా ఇలా ఈ బూడిద గుమ్మడికాయను ఆహార పదార్థాల ద్వారా స్వీకరించడం వలన మనపై కూడా పడిన ఆ నరదిష్టి పూర్తిగా తొలగిపోతుందని శాస్త్రంలో ఉన్నది. అలాగే చిన్న పిల్లలకు దిష్టి తీసి ఆ బూడిద గుమ్మడికాయను ఎవరూ లేనటువంటి ప్రదేశంలో కప్పి ఉంచితే ఆ గుమ్మడికాయ కుళ్లిపోయేలోగా ఆ పిల్లవాడికి ఉన్న దిష్టి అంతా తొలగి ఆరోగ్యంగా మారుతాడు అని తంత్ర శాస్త్రం చెబుతుంది. ఇలా ఈ విధంగా కంటికి కనబడని దివ్యవంతమైన శక్తి తత్వాలు కేవలం ఈ బూడిద గుమ్మడికాయలోనే ఉన్నాయి.