Avakaya Egg Fried Rice : ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఆవకాయతో చేసే ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. మిగిలిన అన్నంతో కూడా ఈ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 2 కప్పులు, మామిడికాయ ఆవకాయ – కారానికి తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, కోడిగుడ్లు – 2, ఉప్పు – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – చిటికెడు, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో అన్నాన్ని తీసుకుని పొడిగా చేసుకోవాలి. తరువాత ఇందులో ఆవకాయ పచ్చడి వేసి అంతా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కోడిగుడ్లు వేసి వేయించాలి. కోడిగుడ్లు వేగిన తరువాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న అన్నం వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా అప్పుడప్పుడూ రుచిగా ఆవకాయతో ఎగ్ ఫ్రైడ్ ను తయారు చేసి తీసుకోవచ్చు.