Beerakaya Kobbari Kura : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, శరీరానికి చలువ చేయడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా బీరకాయ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీరకయాలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. తరుచూ చేసే వంటకాలతో పాటు కింద చెప్పిన విధంగా చేసే బీరకాయ కొబ్బరి కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తయారు చేయడం చాలా తేలిక. బీరకాయలను తినని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు. అన్నం, చపాతీ, రోటీ, పూరీ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ బీరకాయ కొబ్బరి కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ కొబ్బరి కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన లేత బీరకాయలు – అరకిలో, పసుపు – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పచ్చికొబ్బరి తురుము – అరచిప్ప, కాచిన పాలు – 100 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బీరకాయ కొబ్బరి కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి.తరువాత బీరకాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించిన తరువాత కొబ్బరి తురుము వేసి కలపాలి. మరలా మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. అవసరమైతే కొద్దిగా నీటిని పోసి ముక్కలను మగ్గించాలి. ముక్కలు మగ్గిన తరువాత పాలు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ కొబ్బరి కూర తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా తయారు చేసిన కూరను లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.