Bread Bonda Recipe : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లోకి వీటిని చేసి చూడండి.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ కావాలంటారు..

Bread Bonda Recipe : ఉద‌యం చాలా మంది చేసే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో బొండాలు కూడా ఒక‌టి. వీటిని సాధార‌ణంగా మైదా, గోధుమ పిండితో చేస్తారు. ఉల్లిపాయ‌లు, ప‌చ్చి మిర్చి వేసి కూడా బొండాల‌ను చేయ‌వ‌చ్చు. అయితే మైదా, గోధుమ పిండికి బ‌దులుగా బొండాల‌ను బ్రెడ్‌తో కూడా చేయ‌వ‌చ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. బ్రెడ్‌తో చేసే బొండాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తిన‌వ‌చ్చు. లేదా సాయంత్రం స్నాక్స్‌లా కూడా తీసుకోవ‌చ్చు. వీటిని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే బ్రెడ్ బొండాల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ బొండాల త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

బ్రెడ్ ముక్క‌లు – 12, ఆలుగ‌డ్డ‌లు – మూడు, ఉల్లిపాయ – ఒక‌టి, నాన‌బెట్టిన శ‌న‌గ‌లు – కొన్ని, కొత్తిమీర త‌రుగు – 2 టేబుల్ స్పూన్లు, జీల‌క‌ర్ర – ఒక టీస్పూన్‌, కారం – ఒక టీస్పూన్‌, గ‌రం మ‌సాలా – అర టీస్పూన్‌, ప‌సుపు – పావు టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – వేయించేందుకు స‌రిప‌డా.

Bread Bonda Recipe in telugu perfect to eat in breakfast
Bread Bonda Recipe

బ్రెడ్ బొండాల‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా శ‌న‌గ‌లు, బంగాళా దుంప‌ల్ని ఉడికించుకుని తీసుకోవాలి. ఆ త‌రువాత బంగాళా దుంప‌ల పొట్టు తీసి పెట్టుకోవాలి. స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి నూనె వేసి జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌ల్ని వేయించి.. ఉడికించుకున్న బంగాళా దుంప‌ల ముక్క‌లు, శ‌న‌గ‌ల్ని వేసి బాగా క‌లిపి ఆ త‌రువాత ప‌సుపు, కారం, గ‌రం మసాలా, త‌గినంత ఉప్పు వేసి బాగా క‌లుపుకోవాలి. ఇది కూర‌లా అయ్యాక కొత్తిమీర వేసి దింపేయాలి. ఈ మిశ్ర‌మం చ‌ల్ల‌గా అయింద‌నుకున్నాక చిన్న చిన్న ఉండ‌ల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్‌ను తీసుకుని అంచుల్ని తీసేసి నీళ్ల‌ల్లో ఒక‌సారి ముంచి తీసి అందులో బంగాళా దుంప ఉండ‌ను ఉంచి అంచులు మూస్తూ బొండంలా చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకుని రెండు మూడు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్ర‌గా వేయించుకుని తీయాలి. వీటిని వేడి వేడిగా ప‌ల్లి చ‌ట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts