Capsicum Garlic Fry : క్యాప్సికం.. ఇది మనందరికి తెలిసిందే. వెజ్ పులావ్, బిర్యానీ వంటి వాటిలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. క్యాప్సికంను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోనాలను పొందవచ్చు. కనుక దీనిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. ఇతర వంటకాల్లో వాడడంతో పాటు మనం క్యాప్సికంతో కూడా రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. క్యాప్సికంతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యాప్సికం వెల్లుల్లి కారం ఫ్రై కూడా ఒకటి. వెల్లుల్లి కారం వేసి చేసే ఈఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అందరికి నచ్చేలా క్యాప్సికం వెల్లుల్లి కారం ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం వెల్లుల్లి కారం ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన క్యాప్సికం – పావు కిలో, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బలు – 8, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
క్యాప్సికం వెల్లుల్లి కారం ఫ్రై తయారీ విధానం..
ముందుగా జార్ లో కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత క్యాప్సికం ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలను మగ్గించాలి. క్యాప్సికం ముక్కలు మెత్తగా అయిన తరువాత పసుపు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం వెల్లుల్లి కారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా క్యాప్సికంతో ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.