Carrot Payasam : క్యారెట్స్.. మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఇవి కూడా ఒకటి. క్యారెట్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. క్యారెట్స్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్స్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యారెట్ పాయసం కూడా ఒకటి. క్యారెట్స్ తో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. క్యారెట్స్ తో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా రుచికరమైన పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. క్యారెట్ పాయసాన్నితయారు చేయడం చాలా తేలిక. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ పాయసాన్ని తయారు చేసి పెట్టవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ క్యారెట్ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్స్ – 3, పాలు – అర లీటర్, బాదంపప్పు – 8, జీడిపప్పు – 8, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, పంచదార – 4 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
క్యారెట్ పాయసం తయారీ విధానం..
ముందుగా క్యారెట్స్ పై ఉండే చెక్కును తీసేసి వాటిని సన్నగా తురుముకోవాలి. తరువాత జార్ లో బాదంపప్పు, జీడిపప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిని దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత గిన్నెలో పాలను తీసుకుని వేడి చేయాలి. పాలు మరిగి ఒక పొంగు వచ్చిన తరువాత క్యారెట్ తురుము వేసి కలపాలి.
క్యారెట్ తురుము మెత్తగా ఉడికిన తరువాత పంచదార, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పాయసం తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా క్యారెట్స్ తో అప్పటికప్పుడు రుచికరమైన పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.